కోదాడ : కుల వ్యవస్థ, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మానవతావాది మహాత్మా జ్యోతిరావు ఫూలేపై తీసిన పూలే సినిమాను ఎలాంటి సెన్సార్ లేకుండా యధాతధంగా విడుదల చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు, సంస్థ బాధ్యులు పందిరి నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కోదాడ బస్టాండ్ ఎదుట గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన అనంతరం వారు మాట్లాడారు. బ్రాహ్మణ ఫెడరేషన్ ఈ సినిమాను నిలిపివేయాలని ఫిర్యాదు చేసిందన్నారు.
అయితే చారిత్రక వాస్తవాల ఆధారంగానే ఈ సినిమాను నిర్మించామని మూడు వేల ఏళ్ల పాటు శూద్రులు, చండాలురు అనే పేర్లు తగిలించి బానిసలుగా చూసిన అమానుష కుల వ్యవస్థ ఈ దేశంలో రాజ్యమేలుందన్నారు. తమ స్వార్థం కోసం కులం, మతాన్ని వాడుకున్న మనువాదుల దౌర్జన్యాలను ఒంటరిగా ఎదిరించిన ధీశాలి పూలే అని బ్రాహ్మణుడైన దర్శకుడు అనంత్ మహదేవన్ స్పష్టం చేశారని పేర్కొన్నారు.
నాడు పూలే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే దళితుల విద్య కోసం ఎన్నో అవమానాలను భరించి అవిశ్రాంతంగా సమాజ హితం కోసం పని చేశారని పేర్కొన్నారు. ఇలాంటి సినిమాను సెన్సార్ లేకుండా విడుదల చేయాలని వారు డిమాండ్ వేదిక. కార్యక్రమంలో ముత్తవరపు రామారావు, పంది తిరుపతయ్య. రామ నరసయ్య, బడుగుల సైదులు, భిక్షం, హరి కిషన్ రావు, నరసింహారావు, ఉదయగిరి పట్టాభి రెడ్డి, నరేష్ మురళి, రాధాకృష్ణమూర్తి, గోపాల్, బాబు పాల్గొన్నారు.