తుంగతుర్తి, జూన్ 23 : తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాల నుండి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీవనపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు పుల్లూరు శివకేశవ, కరీంనగర్ క్రీడా పాఠశాలకు మాచర్ల సహస్ర క్యాస్ట్రో, వరంగల్ క్రీడా పాఠశాలకు మడిపెద్ది వివేక్, రామనబోయిన ఈష ఎంపిక కావడం జరిగిందన్నారు. పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం, విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందడం ద్వారా విద్యార్థులకు ఉన్నత స్థాయి క్రీడా శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, నిపుణుల పర్యవేక్షణలో సాధన చేసే అవకాశం లభించనుందని, భవిష్యత్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశం వచ్చిందన్నారు.
పాఠశాల విద్యార్థులు రాష్ట్ర క్రీడా పాఠశాలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల అంకితభావం కలిసి ఈ విజయాన్ని అందించాయన్నారు. అనంతరం ఎంపికైన విద్యార్థులను అభినందించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, నిమ్మరబోయిన నవీన, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోత్ కృష్ణ, గుండ్ల ఆంజనేయులు, ప్రీ ప్రైమరీ టీచర్ రామనబోయిన మౌనిక, ఆయా అబ్బగాని మంజుల, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.