చౌటుప్పల్, జనవరి17 : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరిగి భాగ్యనగరం బాటపట్టారు. దాంతో బుధవారం 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. ప్రధానంగా సూర్యాపేట, చౌటుప్పల్ పట్టణ కేంద్రాల్లో వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారిపై తంగడపల్లి రోడ్డు మార్గాన్ని మూసివేశారు.
సంస్థాన్‌నారాయణపురం నుంచి వచ్చే వాహనాలు హైవే ఎక్కకుండా బంద్ చేశారు. అటు వైపు నుంచి వాహనాలు సర్వీసు రోడ్డు వెంట వెళ్లాయి. స్థానిక బస్టాండ్, వలిగొండ క్రాస్ రోడ్డులో బారికేడ్లు అడ్డంగా పెట్టి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. వాహనాల బారులు దీరితే పూర్తిగా మూసి వేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. కేవలం పాదచారులకు మాత్రమే రోడ్డు దాటే ఏర్పాటు చేశారు. ట్రాఫిక్, సివిల్ పోలీసులు కలిపి 70మంది రహదారిపై విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 30మంది పైగా జీఎమ్మార్ సిబ్బంది కూడా ఉన్నారు.
కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్, చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులుదీరి వెళ్తున్నాయి. పంతంగిలో మొత్తం 16 టోల్బూత్లకుగానూ హైదరాబాద్ వైవు 10 తెరిచారు.
ఫాస్టాగ్ ఉన్నప్పటికీ వాహనాల రద్దీ నెలకొంది. గురువారం నుంచి పాఠశాలలు ఉన్న నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగించడంతో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. గురువారం తెల్లవారుజాము వరకు ఈ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్నది.