రామగిరి, జనవరి 14 : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం వికసిత భారత్- గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ-జీ రాంజీ) జీఓ ప్రతులను నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు అర్బన్ కాలనీలో నిర్వహించిన భోగి మంటల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పని లేని సమయంలో పని కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేరు మార్పు చేసి రాష్ట్రాలు 40 శాతం, కేంద్రం 60 శాతం నిధులు ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుందన్నారు.
వెంటనే వీబీ-జీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలన్నారు. అలాగే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్, విత్తన సవరణ చట్టాలకు వ్యతిరేకంగా ఈ 19న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా నాయకులు వడ్డే ధనమ్మ, మొగిలిపాలెం ఇందిరా, దండుగల శేఖర్, కళ్యాణి, జ్యోతి, రేణుక, స్వాతి, లక్ష్మణ్, చందన పాల్గొన్నారు.