ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పీఏసీఎస్‌ల ఎదుట, ఆగ్రోస్ సేవా కేంద్రాల వద్ద రోజంతా క్యూ కట్టినా బస్తా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియా రైతులందరికీ సరిపడా దొరకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
రోజూ యూరియా కోసం తండ్లాట తప్పడం లేదు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేటు వ్యక్తులు యూరియాను బ్లాక్‌లో విక్రయిస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మహిళా రైతులు రోజంతా క్యూలో నిలబడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు.
మోత్కూరు, సెప్టెంబర్ 13: యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. గంటల తరబడి బారులుదీరినా బస్తా యూరియా దొరకక పోవడంతో శనివారం పట్టణంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు.
చందంపేట, సెప్టెంబర్ 13 : చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద చిత్రియాల సహకార సొసైటీకి శనివారం 400 బస్తాల యూరియా వచ్చింది. పోలేపల్లి, ముర్పునూతల, గుంటిపల్లి, చిత్రియాల, పెద్దమూల గ్రామాల రైతులు ఒకేసారి పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలీసులు రైతులను క్యూలో వచ్చేలా ఏర్పాటు చేశారు.
త్రిపురారం, సెప్టెంబర్ 13: యూరియా కోసం మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెల్లవారుజాము నుంచే మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రెండు రోజులుగా మహిళా రైతులు పెద్ద సంఖ్యలో బారులుదీరుతున్నారు. శనివారం ఉదయం 7 గంటలకే చెప్పులతో భారీ క్యూ ఏర్పాటు చేశారు. మధ్యలో చెప్పులు పెడుతున్నారని రైతుల మధ్య గొడవ జరిగింది. యూరియా కోసం కోదాడ- జడ్చర్ల హైవేపై త్రిపురారం ప్రధాన సెంటర్లో రైతులు ధర్నా చేశారు.
చివ్వెంల, సెప్టెంబర్ 13: యూరియా బస్తా మార్కెట్ ధర రూ.266.50 ఉండగా మండలంలోని ఐలాపురం శివారు జా తీయ రహదారి పక్కనే శ్రీ వర్ధన్ ఆగ్రోట్రేడర్స్లో శనివారం రూ.500లకు విక్రయించినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయమై అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా స్పందించడంలేదు.
మునగాల, సెప్టెంబర్ 13 : ఆకుపాముల సొసైటీకి 499 బస్తాల యూరియా రావడంతో శనివారం అర్ధరాత్రి 2 గంటల నుంచే రైతులు క్యూలో నిల్చోని యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు.
తిరుమలగిరి సెప్టెంబర్ 13 : తిరుమలగిరిలోని పీఏసీఎస్ వద్ద శనివారం యూరియా టోకెన్ల కోసం రైతులు క్యూలో బారులు తీరారు. అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఒక్కొక్కరినే అనుమతించి, పోలీసు బందోబస్తు మధ్య యూరియా టోకెన్లు పంపిణీ చేశారు.
మోతె, సెప్టెంబరు 13 : మోతెలోని మన గ్రోమోర్ వద్ద రాత్రి 11 గంటల నుంచే రైతులు క్యూలో చెప్పులు పెట్టారు. మరొకరికి అందకపోవడంతో మన గ్రోమోర్ షట్టర్‌ను మూసి రైతులు ఆందోళన చేపట్టారు. రైతు వేదిక తలుపులపై రాళ్లు వేశారు. రైతులందరికీ కట్టలు అందించాలని వ్యవసాయాధికారి అరుణను రైతు వేదిక కార్యాలయంలో బంధించారు.
చిలుకూరు, సెప్టెంబరు 13 : చిలుకూరు మండలంలోని బేతవోలు, చిలుకూరు గ్రామాల్లో శనివారం యూరియా కట్టలు వచ్చాయి. దీంతో యూరియా కోసం రైతులు బారులు తీరారు.
కట్టంగూర్, సెప్టెంబర్ 13 : కట్టంగూర్ పీఏసీఎస్ వద్దకు శనివారం రెండు లారీలు 888 బస్తాల యూరియా వచ్చింది. దీంతో అధికారులు, సిబ్బంది రైతు వేదిక వద్ద క్యూలో ఉన్న 428 మంది రైతులకు సీరియల్ ప్రకారం టోకెన్లు అందజేశారు. యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుదిరిగిపోయారు.
నార్కట్‌పల్లి సెప్టెంబర్ 13 : శనివారం స్థానిక పీఏసీఎస్ కేంద్రంలోనూ, అమ్మనబోలు గ్రోమోర్ యూరియా షాపు వద్ద పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టి పడిగాపులు కాశారు. కొంతమేర యూరియా రావడంతో సాయంత్రం 4 వరకు వేచి చూసి రానివాళ్లు ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తూ వెళ్లిపోయారు.
శాలిగౌరారం, సెఫ్టెంబర్ 13; శనివారం మండల కేంద్రంలోని శ్రీసాయినాధ్ ఫర్టిలైజర్ షాపువద్దకు లారీ లోడు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజామునుంచే చేరుకున్నారు. స్థానిక రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి, సిబ్బంది రైతుకు రెండు బస్తాల చొప్పున టోకెన్లు రాసి ఇచ్చారు. టోకెన్లు అందని మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు.
చివ్వెంల,సెప్టెంబర్ 13 : మండల కేంద్రమైన చివ్వెంలతో పాటు, వట్టిఖమ్మంపహాడ్ పీఏసీఏస్ కార్యాలయం వద్ద శనివారం తెల్లవారు జామునుంచే యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. టోకెన్లు అందని రైతులు అధికారులతో వాగ్వావాదానికి దిగారు. అధికారులు కేంద్రాలకు తాళాలు వేసి వెళ్లారు. వట్టిఖమ్మంపహాడ్ పీఏసీఏస్ వద్ద తోపులాటలో ఓ రైతు కిండపడటంతో స్వల్ప గాయాలయ్యాయి..
నూతనకల్, సెప్టెంబరు 13 : నూతనకల్‌లోని పీఏసీఎస్ వద్ద వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాసినా యూరియా అందకపోవడంతో శనివారం సూర్యాపేట- దంతాలపల్లి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
అర్వపల్లి, సెప్టెంబరు 13 : శనివారం 440 యూరియా బస్తాలు వస్తే సగం మంది రైతులకే సరిపోయాయి. దీంతో ఒక్క బస్తా యూరియా కోసం ఎన్నిసార్లు తిరగాలంటూ యూరియా అందని రైతులు బాధతో ఇంటి ముఖం పట్టారు.
అడ్డగూడూరు,సెప్టెంబర్ 13: మండలకేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద శనివారం ఉదయం రైతులు క్యూ కట్టారు. శనివారం 444 బస్తాలు మాత్రమే రావడంతో ఒక్కక్కిరికి 2 బస్తాల చొప్పున ఇచ్చారు. సగం మందికే యూరియా బస్తాలు ఇచ్చి, మిగిలిన వారికి టోకెన్లు ఇచ్చారు.