– నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 05 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో దాదాపు గత నెల రోజులుగా నెలకొన్న యూరియా కొరతపై నల్లగొండ ఎంపీ రైతులదే తప్పన్నట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతుంది. రైతులు వచ్చే సీజన్‌కు ముందస్తుగా నిల్వ చేసుకుందామనే ఉద్దేశ్యంతోనే యూరియా కోసం క్యూలైన్లు కడుతున్నారంటూ తేల్చేశారు. శుక్రవారం నల్లగొండలో ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో రైతులు మండిపడుతున్నారు. ‘రైతులు అమాయకులు, ఏదైనా కొరత వస్తుందంటే పానిక్ అయిపోతారు. వచ్చే సీజన్ కోసం… ఇంకా రాబోయే అవసరాల రీత్యా యూరియాను ముందే నిల్వ చేసుకుందాం అనుకుంటున్నారు. అందుకే లైన్లు కడుతున్నారు” అంటూ తేల్చేశారు. ఇంకా బీఆర్ఎస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయాల ఫలితమే యూరియా కృత్రిమ కొరత అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదన్నట్లుగా ‘ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం… పంచేది రాష్ట్ర ప్రభుత్వం… అందుకే ఈ పరిస్థితి.
యూరియా ఇచ్చేది నరేంద్ర మోదీ అని, పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంతో చైనా నుంచి యూరియా రాలేదు.. అందుకే ఆలస్యం అవుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు చెప్పాడు. తమ తప్పిదమని బీజేపీ వాళ్లే ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు హరీశ్‌రావు, కేటీఆర్ లు శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు కొరతను సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారు.” అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కృత నిశ్చయంతో ఉంది. వారం రోజుల తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైతులు ఆందోళన చెంది యూరియా కేంద్రాల వద్ద బారులు తీరవద్దు అని ఎంపీ రఘువీర్ రెడ్డి ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. దీంతో రఘువీర్ రెడ్డి వ్యాఖ్యలపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. గత పక్షం రోజులుగా నిత్యం ఆయన సొంత నియోజకవర్గం నాగార్జునసాగర్‌లోని అన్ని మండల కేంద్రాల్లోనూ రైతులు తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలైన్లు కడుతున్నా… ఆయన రైతులనే తప్పుపట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజనమన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.