చౌటుప్పల్, మార్చి 22 : చౌటుప్పల్ మున్సిపాలిటీలోని హనుమాన్‌నగర్, రత్ననగర్, బంగారిగడ్డ కాలనీల్లో తాగు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్వహణ లోపం కారణంగా ఈ కాలనీలకు రెండు వారాలకోసారి మిషన్ భగరీథ నీళ్లు వస్తున్నాయి. అవి కూడా పావు గంటకు మించి ఇవ్వడం లేదని స్థానికులు వాపోతున్నారు. హనుమాన్‌నగర్‌లో నీటి కోసం వేసిన బోర్లు సైతం వట్టిపోయాయి. నీళ్లు లేకపోవడంతో అద్దె ఇండ్లల్లో ఉంటున్న వాళ్లు ఖాళీ చేస్తున్నారు.
ప్రతి ఇంటికీ డబ్బులు వెచ్చించి వారానికోసారి ప్రైవేట్ ట్యాంకర్ నీళ్లు పోయించుకున్నట్లు కాలనీ వాసులు చెప్తున్నారు. నీళ్లు లేకపోవడంతో అద్దెకు కూడా ఎవరూ రావడం లేదని, లక్షల రూపాయలు అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లకు బ్యాంకు ఈఎంలు చెల్లించకపోతున్నామని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చౌటుప్పల్‌లో తాగునీటికి తీవ్ర సమస్య ఉండగా, కేసీఆర్ సర్కారు ఇక్కడి నుంచే మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఒక్క చౌటుప్పల్ మున్సిపాలిటీకే రూ.25లక్షలు వెచ్చించి ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసింది. వేసవి సమయంలో నీటిని ఎక్కువగా వదలడంతో ఎన్నడూ ఎద్దడి ఏర్పడలేదు. మిషన్ కాకతీయ కారణంగా భూగర్భజలాలు కూడా పెరిగి బోర్లలోనూ గృహ అవసరాలకు నీళ్లు పుష్కలంగా ఉండేవి.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపు లేని కారణంగా మళ్లీ తాగునీటి సమస్య మొదలైందని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. బంగారిగడ్డకు చెందిన సుర్కంటి లావణ్య మాట్లాడుతూ నల్లా నీళ్లు వచ్చి 20 రోజులైందని వాపోయారు. వచ్చినా 15నిమిషాలకు మించి రావడం లేదని తెలిపారు. దాంతో దినం తప్పించి దినం 180 రూపాయలు ఇచ్చి ట్యాంకర్ ద్వారా మూడు డమ్ముల నీళ్లు పోయించుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
కలెక్టర్ వచ్చిన ఒక్క రోజే ట్యాంకర్ తిప్పిండ్రు
ఈ మధ్య కలెక్టర్ సారు పర్యటనకు వచ్చిన ఒక్క రోజు మాత్రమే మా కాలనీలో ట్యాంకర్ తిప్పిండ్రు. తర్వాత ఇటు సైడు రానేలేదు. రోజు మూడు డ్రమ్ముల నీళ్లు కొంటున్నాం. ఆ నీళ్లు కూడా పైన తెల్లగ పేరుకుంటున్నయి. అధికారులు పట్టించుకుని నీళ్ల బాధ తీర్చాలి.
-ఎండీ ఫర్జానా, బంగారిగడ్డ, చౌటుప్పల్