నార్కట్‌పల్లి, మే 18 : ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతున్నది. దాంతో పాటు గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోత మొదలైంది. దానికి తోడు పగటి పూటే గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిపి వేస్తుండడంతో నార్కట్‌పల్లి పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నార్కట్‌పల్లి మండల కేంద్రంలో అనధికార విద్యుత్ కోతలు అధికమవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. రోజుకు ఐదు నుంచి పది సార్లు కరెంటు పోతుండడంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎండ వేడి అమాంతం పెరగడంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్ల ద్వారా ఉపశమనం పొందుతున్నారు. దానికి తోడు వేసవి సెలవులు కావడంతో పిల్లలు, ఎంప్లాయిస్ కూడా ఇండ్లల్లోనే ఉంటున్నారు. అయితే విద్యుత్ సిబ్బంది మరమ్మతుల పేరుతో ఉదయం వేళల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల ఇబ్బందులు చెప్పలేనివిగా ఉన్నాయి. అయితే విద్యుత్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం మరమ్మతుల పేరుతో కరెంటు కోత విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మండు వేసవిలోనూ నిరంతరం విద్యుత్ అందించారని, ప్రస్తుతం వేళాపాలా లేకుండా కోతలు విధిస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు.
ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్న సమయంలోనూ విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొద్దిపాటి గాలివీచినా సరే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా సరే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు రాత్రంతా విద్యుత్ సరఫరా లేక చీకట్లోనే గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, వేసవిలో లోడ్‌కు తగిన విధంగా ఏర్పాట్లు చేయక పోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కనీసం వేసవిలోనైనా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు.
ఈదురు గాలులు వస్తే ఎక్కడైనా వైర్లు తెగిపోయినప్పుడు మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నాం. పట్టణ కేంద్రంలో కరెంటు వస్తూ, పోతూ ఉన్న సమస్య ఉంటే తమకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాల్సింది. చిన్న చిన్న మరమ్మతులు ఉన్నచోట విద్యుత్ నిలిపివేస్తున్నాం. సాధ్యమైనంత వరకు నిరంతరం విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. పట్టణంలో పలు వార్డుల్లో విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగలడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. కొమ్మలను తొలగిస్తున్నాం. ముఖ్యంగా పట్టణంలో రోడ్డు వెడల్పు సమస్య ఉన్నందున అక్కడక్కడ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతున్నది.
ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా రోజుకు 5 నుంచి 10 సార్లు కరెంటు నిలిపేస్తున్నారు. ఇలా కరెంటు వచ్చి పోతుంటే ఇండ్లల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయి. ఎండా కాలం కరెంటు లేక ఇండ్లల్లో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నం. కరెంట్ ఇలా పోతుందేందని విద్యుత్ సిబ్బందిని అడిగినా సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం.
నార్కట్‌పల్లి పట్టణంలో విద్యుత్ అంతరాయం లేని రోజంటూ లేదు. కరెంటు ఎప్పుడు పోతదో ఎప్పుడు వస్తదో తెలియదు. సాయంత్రం గాలిదుమారం వచ్చిందంటే రాత్రంతా కరెంటు ఉండడం లేదు. ఎండా కాలం కావడంతో రాత్రంతా జాగారం చేయాల్సి వస్తున్నది. పిల్లలు, వృద్ధులు మరీ ఇబ్బంది పడుతున్నరు. గత ప్రభుత్వ హయాంలో అసలు కరెంటు కోతలే ఉండేవి కావు. ఉన్నతాధికారులు స్పందించి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలి.