బీబీనగర్, జనవరి 6 : నవ మాసాలు మోసి కన్న శిశువును పుట్టిన కొన్ని గంటల్లోనే ఆలయ ప్రాంగణంలో వదిలివేసిన కరశత్వం ఒక వైపు, తమ బిడ్డ కాకున్నా ఆ శిశువును అకున చేర్చుకుని ప్రాణాలు కాపాడి ఈ బిడ్డను నాకు ఇవ్వండి నేనే పెంచుకుంటా అంటూ ఓ తల్లి వేదన మరోవైపు మండల పరిధిలో చోటు చేసుకుంది. బీబీనగర్ మండలం పడమటి సోమారంలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో మంగళవారం అప్పుడే జన్మించిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆలయ సమీపంలో శిశువు ఏడుపు వినిపించడంతో గ్రామానికి చెందిన యాకరి సంగీత పరమేష్ దంపతులు ఆ పాపను అకున చేర్చుకున్నారు.
చలితో వణుకుతున్న ఆ శిశువు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆ దంపతులు, ఆశా వరర్ సహకారంతో శిశువును బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అకడ బొడ్డు పేగు శుభ్రపరిచి ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం భువనగిరి జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు తక్షణ చికిత్స అందించి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ కమిటీ ఆదేశాల మేరకు శిశువును హైదరాబాద్లోని నీలోఫర్ దవాఖానకు తరలించారు.
ఈ సందర్భంగా యాకరి సంగీత కన్నీళ్లతో మాట్లాడుతూ తమకు పిల్లలు లేరని, పిల్లలు లేని తమకు దేవుడే పాపను ఇచ్చాడని, చట్ట ప్రకారం దత్తత ఇప్పిస్తే శిశువును తానే పెంచుకుంటానని అధికారులను వేడుకున్నారు. పాపకు చికిత్స చేసేంతవరకూ అక్కడే ఉండి పాపను అప్పగించాలని ప్రాథేయపడ్డారు. దత్తత ప్రక్రియ చట్టబద్ధంగానే జరగాలని, అవసరమైన సహకారం అందిస్తామని అధికారులు ఆమెకు భరోసా ఇచ్చారు. శిశువును సకాలంలో గుర్తించి ప్రాణాలు కాపాడిన యాకరి సంగీత – పరమేష్ దంపతులు, ఆశా వరర్ బాలమణిని వైద్యులు అభినందించారు.