యాదాద్రి భువనగిరి, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ స్కూళ్లలోనూ ఇక నుంచి యూనిఫామ్ ఉండనుంది. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు యూనిఫామ్ అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. ఒక్కో విద్యార్థికి జత చొప్పున పంపిణీ చేయనుండగా.. ఇప్పటికే క్లాత్ జిల్లాకు చేరుకుంది. వచ్చే నెల మొదటి వారంలో యూనిఫామ్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సర్కారు ఉచితంగా రెండు జతల యూనిఫామ్ అందిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ఒక జత ఇవ్వగా, త్వరలో రెండో జత ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకే ఇస్తుండగా.. ఇక నుంచి అంగన్వాడీ స్కూళ్లలో చదువుతున్న చిన్నారులకు కూడా యూనిఫామ్ కుట్టించి ఇవ్వనున్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో 3 నుంచి 5 ఏండ్లలోపు చిన్నారులు చదువుతుంటారు. జిల్లాలో మొత్తం 900 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, తొలుత స్కూళ్ల ప్రాంగణాల్లో ఉన్న 491 అంగన్వాడీల్లో ఇది అమలు చేయనున్నారు. మిగతావి రెండో దశలో అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లలో 28,125 మంది చిన్నారులు ఉన్నారు. ఇందులో యాదాద్రి జిల్లాలో 8,392, సూర్యాపేటలో 8,575, నల్లగొండ జిల్లాలో 11,158 మంది చిన్నారులు చదువుకుంటున్నారు.
చిన్నారుల యూనిఫామ్‌కు సంబంధించి ఇప్పటికే డిజైన్ ఫైనల్ చేశారు. నాలుగు రంగుల్లో క్లాత్ ఉండనుంది. రెడ్, యాష్, బ్లూ, వైట్ రంగుల్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 19,237 మీటర్ల రెడ్ క్లాత్, 19,237 మీటర్ల యాష్, 10,398 మీటర్ల బ్లూ, 7,032 మీటర్ల వైట్ కలర్ క్లాత్ అవసరం పడుతుందని అంచనా వేశారు. జిల్లాకు ఇప్పటికే కొంత మేర క్లాత్ చేరుకుంది. క్లాత్‌ను టీఎస్ టెస్కో సరఫరా చేస్తున్నది.
యూనిఫామ్ కుట్టే బాధ్యతలను సెర్ప్‌కు ఇచ్చారు. మహిళా సంఘాల ద్వారా డ్రెస్‌లు కుట్టనున్నారు. దీన్ని డీఆర్డీఓ పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్‌లో మహిళా సంఘాలు బిజీగా ఉన్నాయి. ఇప్పుడు అంగన్వాడీల పని దొరకడంతో మరింత బిజీ కానున్నాయి. మహిళలకు మరింత ఉపాధి లభించే అవకాశం ఉన్నది. స్టిచ్చింగ్కు ఒక్కో బాలిక యూనిఫామ్‌కు రూ.60, బాలుడికి రూ.80 చెల్లించనున్నారు. గతంలో ప్రైవేట్ టైలర్లకు అప్పగిస్తే అధిక సమయం తీసుకుంటుండటంతో మహిళా సంఘాలకే పని కల్పిస్తున్నారు.
అంగన్వాడీల్లో చిన్నారులకు యూనిఫామ్ కోసం జిల్లాకు నాలుగు రకాల క్లాత్ వచ్చింది. వీటిని మహిళా సంఘాల ద్వారా కుట్టించేందుకు చర్యలు చేపట్టాం. తొలుత ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో నడుస్తున్న 491 అంగన్వాడీల్లో అమలు చేస్తాం. వచ్చే నెల నుంచి యూనిఫామ్ పంపిణీ చేస్తాం. అంగన్వాడీలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
– కృష్ణవేణి, పీడీ, ఐసీడీఎస్
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ బడులు, అంగన్వాడీలు ఎంతో అభివృద్ధి చెందాయి. ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా సదుపాయాలు కల్పిస్తున్నారు. సర్కారు బడుల్లో మంచి విద్య అందుతున్నది. అయితే అంగన్వాడీలను మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు యూనిఫామ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రభుత్వ విద్య, పాఠశాలలను ప్రోత్సహించడానికి అంగన్వాడీలను పటిష్టం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.