రామగిరి, సెప్టెంబర్ 12 : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి నూతన ఆలోచనలు చేసేలా విద్యాశాఖ నిర్వహిస్తున్న ‘ఇన్స్పైర్ మనక్’పై పాఠశాలలు అంతగా ఆసక్తి చూపడం లేదు. జూలై 1 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 15తో ముగియనుంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇన్స్పైర్ మనక్‌కు 727 ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అర్హత కలిగి ఉన్నాయి. గురువారం నాటికి 1,022 నామినేషన్లు రాగా వీటిలో ప్రభుత్వం మినహాయించి 59మాత్రమే ప్రైవేట్ పాఠశాలలవి. పలు పర్యాయాలు ఇన్స్పైర్ మానక్‌పై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించినప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు నిర్లక్ష్యం వహిస్తున్నాయనేది స్పష్టమవుతుంది. ఉత్తమ ప్రదర్శనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతోపాటు స్టార్టప్‌గా అవతరించే అవకాశం ఉన్నప్పటీకీ విద్యార్థులను ప్రోత్సహించకపోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి.
ఇన్స్పైర్ మనక్ కింద 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల నుంచి ఎంపిక చేసిన లక్ష ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఒక్కోదానికి ఖర్చుల కోసం రూ. 10 వేలు విద్యార్థి ఖాతాలకు విడుదల చేస్తుంది. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టుల్లో పది శాతం రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వాటిలో పది శాతం జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలిచే 60 నమూనాలను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించే అవకాశం దక్కనుంది. ఒక్కో జాతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.20 వేల నగదు పురస్కారం అందజేస్తారు.
కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇన్స్పైర్ మనక్ పేరుతో ఏటా అవార్డులను అందజేస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి 5, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి 3 చొప్పున నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రాజెక్టులకు నామినేషన్స్‌కు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆమోదంతో వారి గైడ్ టీచర్ సహకారంతో www.inspireawards-dst.gov.in ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఎంపికైన ప్రాజెక్టులకు ఖర్చుల కోసం ఒక్కో దానికి రూ. 10వేలు ప్రభుత్వం అందజేస్తుంది. తయారు చేసిన ప్రాజెక్టులను జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు. అక్కడ ఎంపికైతే రాష్ట్రస్థాయి, రాష్ట్రస్థాయిలో ఎంపికైతే జాతీయ స్థాయికి పంపిస్తారు.
ఇన్స్పైర్ మనక్‌లో నమోదు చేసుకోవడానికి జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆయా యాజమాన్యాల పరిధిలో 727 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమికోన్నత పాఠశాలలు 275 (128 ప్రభుత్వ, 147 ప్రైవేట్), ఉన్నత పాఠశాలలు 454(229 ప్రభుత్వ, 225 ప్రైవేట్) ఉన్నాయి. గురువారం వరకు 286 పాఠశాలల నుంచి 1,022 ప్రాజెక్టులు నమోదు చేసుకున్నారు. వీటిలో 271 ప్రభుత్వ పాఠశాలల నుంచి 963, 15 ప్రైవేట్ పాఠశాలల నుంచి 59 ఉన్నాయి. సగానికిపైగా పాఠశాలలు ముందుకు రాకపోవడంతో అధికారుల పనితీరుతోపాటు ఆయా పాఠశాలల యాజమాన్యాలు, హెచ్ఎంల నిర్లక్ష్య వైఖరి తెలుస్తున్నది. ఎంఈఓలు, జిల్లా విద్యాశాఖాకారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.
పాఠశాల స్థాయిలో విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి చక్కటి అవకాశం ఇన్స్పైర్ మనక్. ఈ పోటీల్లో అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా యాజమాన్యాలు చొరవ చూపాలి. గత సంవత్సరంతో చూస్తే ఈ సారి తక్కువ సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు ఆసక్తి చూపడం లేదు. నామినేషన్లు చేయని పాశాలలతో రివ్యూ చేసి, అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
-బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
ఇన్స్పైర్ మనక్‌తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు పునాది ఏర్పడుతుంది. అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. గడువు ముగిసేలోగా నిర్ధిష్ట లక్ష్యం చేరుకునేలా అందరం కృషి చేద్దాం. అర్హత ఉండి దరఖాస్తులు సమర్పించని పాఠశాలల వివరాలను జిల్లా, రాష్ట్ర అధికారులకు అందజేస్తాం.
-వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి, నల్లగొండ