నిడమనూరు, జూన్ 9 : బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సంక్షేమ సంబురాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కులాంతర వివాహ లబ్ధిదారులకు ప్రోత్సాహక నగదు, బీసీలకు రుణ సాయం చెక్కులను ఎమ్మెల్యేతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అన్ని రంగాల్లో ప్రగతి పరుగులు పెట్టిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే మన రాష్ట్రంలో సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్నారు.
24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భవానికి ముందు సోలార్ విద్యుత్ ఉత్పత్తి 77మెగావాట్లు మాత్రమే ఉండగా స్వరాష్ట్రంలో 5200 మెగావాట్లు, విద్యుత్ ఉత్పాదకత గతంలో 7800 మెగావాట్లకు పరిమితం కాగా ప్రస్తుతం 18వేల మెగా వాట్లకు, యాదాద్రి పవర్ ప్లాంట్‌తో 4వేల మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం పెరగనుందన్నారు. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు లిఫ్టులతో 3లక్షల ఎకరాలకు, సాగర్ ప్రాజెక్టుతో 4లక్షల ఎకరాలకు సాగు నీరందించిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సాగర్ ఉప ఎన్నికకు ముందు నెల్లికల్, ఏకేబీఆర్ నుంచి గుర్రంపూడ్ వరకు జిల్లాలో మొత్తం 10లిఫ్టులను సీఎం కేసీఆర్ మంజూరు చేయగా రూ.1900కోట్లతో పనులు జరుగుతున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో 44,538కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.418కోట్లు, 517 మందికి దళిత బంధు పథకం కింద 51కోట్లు అందించినట్లు తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరో మారు అధికారంలోకి తేవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అంకుముందుకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి పూలమాలలతో శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చేకూరి హనుమంతరావు, ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, నిడమనూరు, హాలియా మార్కెట్ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామర్ల జానయ్య, డీఎల్పీఓ ప్రతాప్ నాయక్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, బీఆర్ఎస్ నాయకులు మందలపు మురళి, లకుమాల మధుబాబు, మేరెడ్డి వెంకటరమణ, మాచ ర్ల దాసు, కోమటి వెంకన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, తాసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.