చిట్యాల, మార్చి 22 : కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కె.శివరామిరెడ్డి తెలిపారు. శనివారం చిట్యాల సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా ఖగా మండలం రోషన్‌పూర్ గ్రామానికి చెందిన కమలేశ్పాల్, శివపురికి చెందిన నిర్భయసింగ్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నివాసం ఉంటూ ఐస్ క్రీములు విక్రయిస్తూ జీవిస్తున్నారు.
జల్సాలకు అలవాటు పడిన వీరు ఐస్ క్రీములు విక్రయించగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పంకజ్ అనే వ్యక్తి ద్వారా గంజాయిని కొనుగోలు చేసి దానిని ఇక్కడ తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి రోడ్డు వెంట గల దాబాల వద్ద లారీ డ్రైవర్లకు, కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం రామన్నపేట రోడ్డులోని ఒక దాబా హోటల్ దగ్గర చిట్యాల సీఐ కె. నాగరాజు, ఎస్ఐ ఎన్.ధర్మా తమ సిబ్బందితో నిఘా పెట్టి అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా కేజీన్నర గంజాయి లభించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.