సూర్యాపేట, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మరణించి పక్షం రోజులు గడవకముందే పార్టీలో పట్టు కోసం రెండు వర్గాలు రచ్చకెక్కుతున్నాయి. సూర్యాపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కోసం ఎవరికి వారు అధిష్టానంపై తీవ్రస్థాయిలో వత్తిడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్డీఆర్ దశదిన కర్మకు ముందు దివంగత దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తంరెడ్డిని ఇన్చార్జిగా ప్రకటించాలని ఆర్డీఆర్ వర్గీయులు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గాంధీభవన్‌లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పదేండ్లుగా కాంగ్రెస్ పార్టీకి కొంతమందితో శని పట్టుకుందని, దామన్న ఓటమికి తర చూ పార్టీ మారిన వారు… డబ్బులకు అమ్ముడు పోయేవారే ఒక వర్గం నాయకులేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అయితే పేరు చెప్పకపోయినప్పటికీ ఆ వ్యాఖ్యలు పరోక్షంగా పటేల్ రమేశ్‌రెడ్డిని ఉద్దేశించినవేనని సూర్యాపేటలో చర్చ జరుగుతోంది. మరోపక్క తాజాగా గాంధీభవన్‌లో పటేల్ రమేశ్‌రెడ్డికి ఇన్చార్జి ఇవ్వాలం టూ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక సంవత్సరాలపాటు సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. నాడు వర్గపోరు చెప్పుకోదగ్గంతగా కూడా లేదు. 1999 నుంచి 2009 వరకు జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విజయం సాధించడం ద్వారా సూర్యాపేటలో కాంగ్రెస్ విజయ పరంపరకు చెక్‌పడింది. తిరిగి 2018 ఎన్నికల్లో సుమారు ఏడాదికి ముందు రేవంత్‌రెడ్డితోపాటు పటేల్ రమేశ్‌రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.
దాదాపు అప్పటి నుంచి కాంగ్రెస్‌లో వర్గపోరు షురూ అయిందని చెప్పవచ్చు. 2018లో జరిగిన ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని చివరిదాకా పోరాడినా దామోదర్‌రెడ్డికే టికెట్ రావడం నాటి ఎన్నికల్లో జగదీశ్‌రెడ్డి విజయం సాధించడం జరిగింది. దీంతో ఆర్డీఆర్ ఓటమికి కారణం పటేల్మ్రేశ్రెడ్డి వర్గం పని చేయకపోవడమేనని దామోదర్‌రెడ్డి వర్గీయు లు ఆరోపించగా దామోదర్‌రెడ్డి అనుచరుల ఆగడాలే ఓటమికి కారణమని రమేశ్‌రెడ్డి వర్గీయులు ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏది జరిగినా రెండు వర్గాలు వేర్వేరుగానే చేపట్టారు. 2023 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ద్వారా రమేశ్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నం ముమ్మరంగా చేయగా చివరి నిముషంలో దామోదర్‌రెడ్డి టికెట్ దక్కించుకోగా ఈసారి ఎన్నికల్లో సైతం జగదీశ్‌రెడ్డిపై ఓటమిపాలయ్యారు. దీనికి కారణం కూడా రమేశ్‌రెడ్డి వర్గం పనిచేయకపోవడమేనని దామోదర్‌రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు.
ఇన్చార్జి కోసం పట్టు
దామోదర్‌రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ వర్గపోరు మరోసారి బహిర్గతం అవుతుంది. దామోదర్‌రెడ్డి మరణానికి కొద్ది రోజుల ముందు ఎమ్మెల్యే మురళీనాయక్ ఆధ్వర్యంలో లోకల్‌బాడీ ఎన్నికల సన్నాహక సమావేశం, తదనంతరం ఏఐసీసీ అబ్జర్వర్ శరత్రావత్ డీసీసీ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ కోసం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశాలు వర్గపోరును బహిర్గతం చేశాయి. ఇతర పార్టీల్లో పని చేసి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు పార్టీ కోసం పని చేయకుండా సీనియర్లను కాదని పదవి కోసం తహతహలాడుతూ పార్టీని బ్రష్టుపట్టించారని, అలాంటి వారికి బడితపూజ చేయాల్సిన అవసరం ఉందని దామన్నవర్గీయులు తీవ్ర స్థాయిలో మండిపడ్డ వీడియోలు సూర్యాపేటలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు యాభై ఏండ్లుగా పార్టీకి సేవలందించిన దామన్న ఆశయాలను కొనసాగించేందుకు ఆయన తనయుడు సర్వోత్తంరెడ్డికి ఇన్చార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దామన్న దశదినకర్మకు రెండు రోజుల ముందు గాందీభవన్‌లో సర్వోత్తంరెడ్డికి ఇన్చార్జి ఇవ్వాలని కోరుతూ పోస్టర్లు అతికించారు. దీంతో రమేశ్‌రెడ్డి వర్గం కూడా అప్రమత్తమై వెంటనే నాలుగైదు రోజుల వ్యవధిలో రమేశ్‌రెడ్డికే ఇవ్వాలంటూ పోస్టర్లు వెలిశాయి. వర్గపోరు ఈస్థాయిలో ఉండడంతో ఇన్చార్జి ఎవరికి ఇస్తారు..? ఏ వర్గానికి వస్తే మరో వర్గం వారు ఎలా స్పందిస్తారో వేచి చూ డాల్సి ఉంది. కాగా సూర్యాపేట కాంగ్రెస్‌లో ఆదిపత్యపోరుపై అధిష్టానం తలలు పట్టుకుంటుండగా కిందిస్థాయి క్యాడర్ మాత్రం ఈ గ్రూపుల గొడవేందిరా బాబూ అనుకుంటున్నారు.