భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 18 : చేనేత సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగిసి ఏండ్లు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడంతో సంఘాల అభివృద్ధి కుంటుపడుతున్నది. పర్సన్ ఇన్చార్జి అధికారులను నియమించడంతో చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించలేకపోతున్నారు. జిల్లాలో 2013లో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరుగగా.. 2018 ఫిబ్రవరిలో పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. ప్రతి ఐదేండ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 2018లో కొత్త పాలకర్గాలను ఎన్నుకోకుండా పర్సన్ ఇన్చార్జిలను నియమించారు. అప్పటి నుంచి అధికారుల పాలన కొనసాగుతుండటంతో సంఘాల్లో కార్మికులకు పని కల్పించడం లేదు.
పోచంపల్లి చేనేత సహకార సంఘంలో 920 మంది చేనేత కార్మికులు సభ్యత్వం కలిగి ఉన్నారు. వారిలో 450 మంది కార్మికులు క్రియాశీలకంగా చేనేత మగ్గాలు నేసేవారు. వారికి చేతినిండా పని కల్పించకపోవడంతో క్రమంగా సభ్యుల సంఖ్య 150కి తగ్గింది. కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలు, ముడి సరుకులు సకాలంలో అందించలేకపోతున్నారు. చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్ద కూలికి మగ్గాలు నేస్తున్నారు. గతంలో పాలకవర్గం ఉన్నప్పుడు పోచంపల్లి చేనేత సహకార సంఘానికి ఏడాదికి మూడు కోట్ల టర్నోవర్ అయ్యేది. అది నేడు రూ.1.70 కోట్ల నుంచి రెండు కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం నెలకు 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు అమ్మకాలు పడిపోయాయి.
పోచంపల్లి, కొయ్యలగూడెం, చౌటుప్పల్, భువనగిరి తదితర సంఘాలకు ఏడాదికి రెండు కోట్లకు పైగా వస్త్రాలు తయారు చేయించే సామర్థ్యం ఉంది. అయితే.. వాటి నుంచి టెసో 50 లక్షల వస్త్రాలు కూడా కొనడం లేదు. పోచంపల్లి చేనేత సహకార సంఘానికి రూ.20 లక్షల బకాయిలు రావలసి ఉన్నది. మారెట్ సౌకర్యం లేకపోవడంతో పోచంపల్లి చేనేత సహకార సంఘంలో సుమారు రూ.2కోట్ల విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. దాంతో చేనేత కార్మికులకు పని కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2018లో చేనేత సంఘాల పాలకవర్గం గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు జరుగుతాయని గత పాలకవర్గం, అధికారులు భావించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో పర్సన్ ఇన్చార్జిలు కొనసాగుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేనేత సహకార, పవర్లూమ్లు కలిపి మొత్తం 84 సంఘాలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 43 సంఘాలు ఉండగా.. 12 మాత్రమే క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. వీటిలో మొత్తం 18,882 మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 25 సహకార, 5 పవర్లూమ్ సంఘాలు ఉండగా.. వాటిల్లో మొత్తం 6,588 కార్మికులు సభ్యులుగా ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలో 3 సంఘాలు మాత్రమే పనిచేస్తుండగా.. వాటిల్లో 330 మంది సభ్యులు ఉన్నారు. యాదాద్రి జిల్లాలోని చేనేత సహకార సంఘాల పాలక బాధ్యతలను ఇన్చార్జిలకు అప్పగించారు. భూదాన్ పోచంపల్లి, సిరిపురం, తుమ్మలగూడెం, బోగారం, వెల్వర్తి సహకార సంఘాల్లో నిధుల దుర్వినియోగం, అక్రమాలు జరిగాయనే ఆరోపణతో చేనేత జౌలి శాఖ అధికారులను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించింది. వారు విధి నిర్వహణతోపాటు సంఘాలకు పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపడుతున్నారు.
చేనేత సంఘాలకు పాలకవర్గం ఉంటే కార్మికుల సాధక బాధకాలను తెలుసుకొని మా అవసరాన్ని గుర్తిం చి సమకూరుస్తారు. కార్మికులకు పని కల్పించి సకాలంలో డబ్బులు చెల్లించాలి. చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్మికులం ఇబ్బంది పడుతున్నాం. మా సమస్యలు అధికారులకు తెలువదు. చెప్పినా పట్టించుకోరు.
– రుద్ర వెంకటేశం, చేనేత కార్మికుడు, భూదాన్ పోచంపల్లి