చందంపేట, ఫిబ్రవరి 28 : తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆడుకుంటూ స్నానానికి వెళ్లి నీటి కుంట పడిలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చందంపేట మండలంలోని నక్కలగండి కట్ట సమీపంలోని ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మోత్యాతండా పరిధిలోని నక్కలగండి తండాకు చెందిన కాట్రావత్ రూప్లా, సరోజ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు హరిప్రసాద్(7), బిట్టు(5) ఉన్నారు. శుక్రవారం ఉదయం రూప్లా దంపతులు వ్యక్తిగత పని మీద దేవరకొండకు వెళ్లారు. పిల్లలిద్దరూ ఇంటి వద్దే ఉండి ఆడుకుంటున్నారు.
నక్కలగండి కట్ట సమీపంలో ఇసుక తోడడంతో ఏర్పడిన గుంతల్లో డిండి ప్రాజెక్టు నుంచి వచ్చిన నీరు వచ్చి చేరడంతో కుంటలు మారి నీళ్లు నిలిచాయి. హరిప్రసాద్, బిట్టు స్నానం చేసేందుకు నీటి కుంటలో దిగారు. ఈత రాకపోవడంతో మునిగి చనిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కుంట వద్ద పిల్లల బట్టలు ఉండడం గమనించి గాలించగా ఇద్దరి మృతదేహాలు దొరికాయి. పిల్లల మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు దేవరకొండ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు.