నీలగిరి, జూలై 11: ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలో నుంచి బంగారు పుస్తెలను ఎత్తుకెళ్తున్న అన్నతమ్ముళ్లను అరెస్టు చేసి వారి నుంచి 19.5 తులాల బంగారం, నాలుగు బైక్‌లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చండూర్ మండలం గొల్లగూడెంలో మారగోని బుచ్చమ్మ చెల్క నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇడికుడ దారి ఎటువైపు అంటూ అడిగి మాటల్లో పెట్టి అమె మెడలోని మూడు తులాల పుస్తెలతాడును లాక్కొని వెళ్లినట్లు తెలిపారు.
దీనిపై నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలోచండూర్ ఎస్ఐ వెంకన్న, కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి సిబ్బందితో నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 7.30 సమయంలో చం డూరు ఎస్ఐ వెంకన్న తాసానిగూడెం శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా, ఇద్ద రు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని వివరాలు అడగ్గా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
విచారణ చేయగా త్రిపురారం మండలంలోని నీలాయిగూడానికి చెందిన రావిరాల పవన్, రావిరాల రాజు అన్నదమ్ముళుగా గుర్తించామని చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసై, ఆర్థిక ఇబ్బందుల వల్ల జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈక్రమంలో వాడపల్లి మండలం కల్లేపల్లి, పెన్‌పహాడ్ మండలంలోని అనాజీపురం, లింగాల, దోసపహాడ్, వేములపల్లి మండలం బీరెల్లిగూడెం, నకిరేకల్ మండలంలోని చందుపట్ల, మర్రూరు, చండూర్ మండలం గొల్లగూడెం గ్రామాల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు వివరించారని చెప్పారు.
చైన్ స్నాచింగ్‌లకు ఉపయోగించిన నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు సెల్ఫోన్లలతోపాటు 19.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ రమేశ్, నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, చండూర్ సీఐ ఆదిరెడ్డి, చండూర్, కనగల్ ఎస్ఐలు వెంకన్న, విష్ణు మూర్తి సిబ్బంది ఉపేంద్రాచారి, శ్రీకాంత్, కార్తీక్, హరున్, నగేశ్, అనిల్, ఖలీల్, రమేశ్, నరేందర్ ఉన్నారు.