సూర్యాపేట జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవంలో విషాదం నెలకొంది. ఆత్మకూర్.ఎస్ మండలం కోటినాయక్తండాకు చెందిన బానోతు సూర్య(55), బానోతు నాగు(40) శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనానికి వెళ్లి ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్లో పడి గల్లంతయ్యారు. సూర్య మృతదేహాన్ని రాత్రి 10.30 గంటలకు పోలీసులు గుర్తించారు. నాగు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఆత్మకూర్.ఎస్, సెప్టెంబర్ 9 : గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మండలంలోని కోటినాయక్తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు శుక్రవారం రాత్రి నిమజ్జన సమయంలో ఎస్సారెస్పీ కాల్వలో కాలుజారి పడి గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బానోతు సూర్య(55) బానోతు నాగు(40) గణేశ్ నిమజ్జనానికి వెళ్లారు. విగ్రహాన్ని ఎస్సారెస్పీ 71డీబీఎం మెయిన్ కెనాల్లో నిమజ్జనం చేస్తుండగా కాలు జారడంతో కాల్వలో పడి గల్లంతయ్యారు.
కుటుంబ సభ్యుల కండ్ల ముందే గల్లంతవడంతో రోదనలు మిన్నంటాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్, ఎస్ఐ యాదవరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కోటినాయక్తండా శివారులో గల్లంతైన ఇద్దరిలో బానోతు సూర్య మృతదేహం లభించింది. మరోకరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బానోతు సూర్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నాగుకు కూతురు, కొడుకు ఉన్నారు.