నల్లగొండ, నవంబర్ 14 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగస్తుల అసోసియేషన్ (సామాజిక సేవ) భవనంలో శుక్రవారం జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంఘం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ గతంలో అలాగే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా భవన నిర్మాణం గురించి వివరించారు. పెన్షనర్లకు సంబంధించిన సమస్యల గురించి జిల్లా పక్షాన చేపట్టిన కార్యక్రమాలను తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జె. శ్రీశైలం మాట్లాడుతూ.. గత పీరియడ్లో సంఘం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి తమ నివేదిక ద్వారా తెలిపారు. తదుపరి గత కాలానికి చెందిన ఆర్థిక నివేదికను కోశాధికారి జి.మోహన్ రెడ్డి సమర్పించారు. సభ్యులందరూ నివేదికలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సంఘం పెన్షనర్ల సమస్యలు, రావాల్సిన ఐదు కరువు భత్యంల గురించి, ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్య సేవలు సాధించుట, సంఘం పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివిధ సందర్భాల్లో నివేదికల ద్వారా అర్ధిస్తూ చేసిన కృషి గురించి తెలిపారు. భవన కమిటీ అధ్యక్షుడు గాయం నారాయణరెడ్డి ప్రసంగిస్తూ.. జిల్లాలోని వివిధ మండల శాఖలకు భవనాల ఏర్పాటు, నిర్మాణం గురించి జరిగిన ప్రయత్నాలలో ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విషయాల గురించి వెల్లడించారు. తదుపరి ఎన్నికల నిర్వహణ అధికారి కె.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు రంగయ్య, అసోసియేట్ అధ్యక్షుడు మోహన్ రావు, ఉపాధ్యక్షులు యుగేందర్ రెడ్డి, ఆంజనేయులు, కృష్ణయ్య, కార్యదర్శులు కె.నారాయణరెడ్డి, బి.లింగయ్య, ఎండీ హుస్సేన్, ప్రచార కార్యదర్శి ఎం.శంకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు సంతోష్ రెడ్డి, యాదగిరి, వెంకట్ రెడ్డి, వివిధ మండలాల నుండి నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Nalgonda : టీఎస్జీఆర్ఈఏ నల్లగొండ సమావేశం