రామగిరి, డిసెంబర్ 27 : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) 6వ రాష్ట్ర మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 28, 29, 30వరకు జరుగనున్నాయి. హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్‌లో అమరజీవి షేక్ మహబూబ్ అలీ ప్రాంగణం పేరుతో సభకు ఏర్పాట్లు చేశారు.
సభలకు వచ్చే ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 7వేలమంది ఉపాధ్యాయులు తరలి వస్తారని ఆహ్వాన సంఘం చైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సభలు జరిగే ప్రాంతాన్ని వారు పరిశీలించారు. మూడు రోజులు సాగే సభలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వాగత తోరణాలు కట్టారు. ఉమ్మడి రాష్ట్రం 2008లో విజయవంతంగా రాష్ట్ర మహాసభలు నిర్వహించగా, ఇప్పుడు ఆదే స్ఫూర్తితో ఏర్పాట్లు చేశారు.
మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా తరలిరానున్న 7వేల మంది ఉపాధ్యాయులతో గడియారం సెంటర్ నుంచి లక్ష్మీగార్డెన్ వరకు మహా ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణ, ఎస్టీఎఫ్ఐ, టీఎస్‌యూటీఎఫ్ జెండాల ఆవిష్కరణ ఉంటుంది.
మహాసభలకు అతిథులుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ, భువనగిరి ఎంపీలు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం జరిగే విద్యా సదస్సులో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు, జేఎన్‌యూ ఢిల్లీ పూర్వ విద్యార్థి నాయకుడు కుమారి అయిషే ఘోష్, రాత్రి జరిగే సాంస్కృతిక ప్రదర్శనలకు సినీగేయ రచయిత, కవి సుద్దాల అశోక్‌తేజ పాల్గొననున్నారు.