కట్టంగూర్, ఏప్రిల్ 17 : ప్రభుత్వం దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యం విడనాడి ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ దివ్యాంగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోలి ప్రభాకర్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని మల్లారం, బొల్లెపల్లి గ్రామాల్లో పర్యటించి దివ్యాంగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటిన వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను నిలువున మోసం చేస్తుందని ఆరోపించారు. దివ్యాంగులకు పింఛన్లు పెంచడంతో పాటు రేషన్ కార్డుల ద్వారా 35 కేజీల బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని లేకపోతే జూన్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీలమ్మ, సరిత, సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు.