రామగిరి, సెప్టెంబర్ 25 : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి టీఆర్టీఎఫ్ కట్టుబడి ఉందని, ఆ మేరకు కృషి చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పిడి మల్లయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) నల్లగొండ మండల శాఖ అధ్యక్షుడిగా అప్పాజీపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వడ్లకొండ సోమనర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా గొల్లగూడ పార్క్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ముడుసు శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా బొమ్ము కృష్ణ, కట్టంగూర్ మండల అధ్యక్షుడిగా చిట్టబోయిన లింగయ్య, నార్కెట్పల్లి మండల అధ్యక్షుడిగా కె.శేషగిరి, తిప్పర్తి మండల అధ్యక్షుడిగా బెజవాడ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా నాళ్ల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గురువారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మనగోటి జనార్ధన్, తరాల పరమేశ్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు నంద్యాల మోహన్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అర్రూరి జానయ్య, రాష్ట్ర కార్యదర్శి దొడ్డేని సాయిబాబు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పెండెం శ్రీనివాసులు, మాజీ జిల్లా బాధ్యులు తంతెనపల్లి సైదులు, జలంధర్ రెడ్డి, నల్లబోతు సురేశ్ పాల్గొన్నారు.