చౌటుప్పల్, డిసెంబర్ 7 : చౌటుప్పల్ రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు శనివారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి భువనగిరి సభలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మాట తప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేస్తున్నారని, భూ సేకరణ పత్రాలపై బలవంతంగా అధికారులు సంతకాలు సేకరిస్తున్నారని తెలిపారు. బహిరంగా మార్కెట్ ధరకు కాకుండా తక్కువకు భూములు లాక్కుంటున్నారని వాపోయారు. ఎక్కడా భూసేకరణ చట్టం అమలు చేయడం లేదన్నారు. మిగతా ప్రాంతాల్లో ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో భూములు తీసుకొని, ఉత్తర భాగంలో మాత్రం 28 కిలోమీటర్లకు పరిమితం చేశారని వివరించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. గతంలో చౌటుప్పల్ జంక్షన్‌కు 78 ఎకరాలు ప్రతిపాదించగా, ఇప్పుడు 184 ఎకరాలు పెంచారంటూ ఆయా సమస్యలపై హరీశ్‌రావుకు వినతిపత్రం అందజేశారు.
ఆయన స్పందిస్తూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో బాధితుల పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. హరీశ్‌రావును కలిసిన వారిలో ట్రిపుల్ ఆర్ బాధితుల సంఘం కన్వీనర్ చింతల దామోదర్ రెడ్డి, నాయకులు, రైతులు పెద్దిటి బుచ్చిరెడ్డి, బోరం ప్రకాశ్ రెడ్డి, సందగళ్ల మల్లేశ్ గౌడ్, జాల వెంకటేశ్ యాదవ్ పాల్గొన్నారు.