భువనగిరి కలెకర్టేట్/ బీబీనగర్, ఆగస్టు 27 : గిరిజన సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిషరించాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ కోరారు. మంగళవారం బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ దవాఖానను ఆయన సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. గిరిజన సంఘాల ప్రతినిధులు కమిషన్ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిషరించాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన హకులను కాపాడుతూ వారి సమస్యలను పరిషరించాలన్నారు. మారుమూల తండావాసుల విషయంలో అధికారులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని సూచించారు. సమస్యలపై ఆన్‌లైన్‌లోనూ గిరిజన కమిషన్‌కు ఫిర్యాదులు అందించవచ్చనని తెలిపారు. సింగన్నగూడెం బాలిక హాస్టల్, ఎల్లమ్మ గుడి బాయ్స్ హాస్టళ్లలో డ్రైనేజీ సమస్యలు రెండ్రోజుల్లో పరిషరించాలని ఆదేశించారు.
2005 సంవత్సరానికి ముందు నుంచి సేద్యం చేస్తున్న గిరిజనులకు భూమిపై హకు కల్పిస్తూ పట్టాలు జారీ చేయాలని సూచించారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి చార్జిషీట్ దాఖలు కాగానే వంద శాతం నష్టపరిహారం బాధితులకు అందించేలా చర్యలు తీసుకోవాలని డీసీపీకి సూచించారు. లప్పానాయక్ తండాలో భూమి కోల్పోయిన వారికి బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కట్టిచ్చేలా, లేదా భూమికి భూమి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాచకొండ మండలంలో పాత పాస్‌పుస్తకాల స్థానంలో కొత్తవి ఇవ్వలేదని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో మూసివేసిన 6 గిరిజన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్నారు. జిల్లాలో సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి, బంజారా భవన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. వైటీడీఏ పరిధిలో అన్ని రకాల ఉద్యోగాల్లో ఎస్టీ రోస్టర్ సరిగ్గా మెయింటెన్ చేసేలా, రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బీబీనగర్ ఎయిమ్స్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులు బయటి ప్రాంతాల నుంచి వచ్చి వెళుతున్నందున వారికి పోలీస్ భద్రత కల్పించాలని డీసీపీకి సూచించారు. మైనింగ్ పనుల్లో గిరిజనులకు అనుమతుల కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. తండాల్లో గిరిజనుల ఆస్తి, ప్రాణాలను హరించే బెల్ట్ షాపుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
సమావేశంలో కలెక్టర్ హనుమంతు కే జెండగే, డీసీపీ రాజేశ్చంద్ర, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే గంగాధర్, ఆర్డీఓ అమరేందర్, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గిరిజన సంక్షేమ ఇన్చార్జి అధికారి నాగిరెడ్డి, నీటి పారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.