Vegetables | ఆత్మకూర్.ఎస్, మే 11 : అందరిలాగా ఒకే రకమైన పంటలు వేసి గిట్టుబాటు ధర రాక నష్టం పోకూడదనే లక్ష్యంతో సాగు చేస్తున్నారు. ఆ రైతులు. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మండలంలోని బోరింగ్తండాకు చెందిన గిరిజన రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో వరి, పత్తి పంటలతోపాటు కూరగాయలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఆవాస గ్రామంలో కొందరు రైతులు గత ఐదేండ్లుగా బెండ, కాకర, వంగ, దోసకాయలతోపాటు ఆకుకూరలైన పాలకూర, కొత్తిమీర, పుదీన సాగు చేస్తున్నారు. సమీపంలోని నూతనకల్ మండలంలోపాటు ఆత్మకూర్.ఎస్ మండలంలోని పలు గ్రామాల్లో విక్రయిస్తున్నారు.
నెమ్మికల్ వారాంతపు సంతలో విక్రయించడం ద్వారా అధిక లాభాలు పొందుతున్నట్లు చెబుతున్నారు. ఈ సాగులో పెట్టుబడి తగ్గడమే కాకుండా తక్కువ సమయంలోనే కూరగాయలు, ఆకుకూరలు చేతికి వస్తుండడంతో ఇతర పంటల పెట్టుబడికి ఉపయోగపడుతున్నాయని పేర్కొంటున్నారు. ఇంటి ఖర్చుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఉంటుందంటున్నారు. వాతావరణం అనుకూలించక పోయినా, ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం పొందవచ్చనే ఆశతో కూరగాయలు, ఆకుకూరల సాగువైపు దృష్టి సారించినట్లు పేర్కొంటున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకు దళారుల బెడద తక్కువని, పైపెచ్చు సొంతంగా అమ్ముకోవచ్చని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారులే తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేయడం ద్వారా అమ్మకాల బెడద ఉండదని చెబుతున్నారు. ఒకరిని చూసి మరొకరు సాగుపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు.
తాజాగా ఉండడంతో కొనుగోలు చేస్తుండ్రు
నాకున్న రెండెకరాల భూమిలో ఎకరంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాను. ప్రస్తుతం వంకాయ, బెండ, ఆకుకూరలు వేశాను. ప్రతి పంటపై రూ.5 వేల పెట్టుబడి పెట్టాను. ఇప్పటికే రెండు పంటలను రెండు విడుతలుగా కోసి సంతలో విక్రయించాను. మరో నాలుగు విడుతలు కోతకు వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఉండడంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మంచి లాభాలు కూడా వస్తున్నాయి.
-గుగులోతు క్వేలా, బోరింగ్తండా
కూరగాయలను మించిన పంటలు లేవు
పత్తి, వరి సాగుకంటే కూరగాయల సాగు మేలు. వీటిని మించిన పంటలు లేవు. ప్రస్తుతం ఎకరం భూమిలో వంగ, టమాట, దోసతోపాటు ఆకుకూరలు సాగు చేస్తున్నా. ప్రతి పంటపై రూ.5 నుంచి 10 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ప్రతి పంటపై సంవత్సరానికి రూ.60 వేల వరకు లాభం వస్తుంది. ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం వస్తుందన్న ధీమా ఉంటుంది.
-గుగులోతు శేఖర్, బోరింగ్తండా