రామగిరి (నల్లగొండ), జూన్ 05 : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, మానవ మనగడకు చెట్లు ఎంతగానో దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు ఆవరణలో గురువారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణంలో వస్తున్న మార్కులతో పాటు భూమిపైన పెరుగుతున్న ఉష్ణోగ్రతను తగ్గించాలంటే విరివిగా మొక్కలు నాటి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి పెంచడం వల్ల భవిష్యత్లో పర్యావరణ సమస్యల పరిష్కారంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టులోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు సంపూర్ణ ఆనంద్, దుర్గాప్రసాద్, రోజా రమణి, శిరీష, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు, డిఫెన్స్ కౌన్సిల్ నిమ్మల భీమార్జున్ రెడ్డి, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.