నాగార్జునసాగర్, జూన్ 17 : అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ను మంగళవారం ట్రైనీ ఐఏఎస్ ల బృందం సందర్శించింది. తెలంగాణ దర్శనంలో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు జిల్లా శిక్షణ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ ను సందర్శించారు. దీనిలో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనం చేరుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించబడిన సౌరబ్ శర్మ, నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన క్యారోలిన్ చింగ్ తీ అమ్మావై లు మిర్యాలగూడ సబ్ కలెక్టర్, (లోకల్ బాడీస్ ) ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ నారాయణ అమిత్ తో సమావేశమయ్యారు. అనంతరం బుద్ధ వనంలోని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి సమర్పించారు. బుద్ధ చరితవనం, జాతక వనం, ధ్యానవనం, స్థూప వనంను సందర్శించి మహా స్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిని వెలిగించారు.
సమావేశ మందిరంలో బుద్ధవనం డాక్యుమెంటరీని వీక్షించిన అనంతరం బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు ట్రైనీ ఐఏఎస్ లకు బుద్ధ వనం బ్రోచర్లతో పాటు, పంచశీల కండువాలను బహుకరించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం, నాగార్జునకొండ చారిత్రక విశేషాలను, నాగార్జునసాగర్ డ్యామ్ వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో తెలంగాణ దర్శన్ డిస్టిక్ ట్రైనింగ్ ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, ప్రోటోకాల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దండ శ్రీనివాస్ రెడ్డి, విజయ విహార్ మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు.