కొండమల్లేపల్లి, ఆగస్టు 23: మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటన అత్యంత దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం రూపారెడ్డి కుటుంబ సభ్యులను పరమార్శించి ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులపై తరుచూ జరుగుతున్న దాడులు చూస్తుంటే భవిష్యత్‌లో చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు జంకుతారన్నారు. విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
వ్యసనాలకు దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. విద్యార్థుల తప్పిదాలకు పేరెంట్స్‌ను కూడా బాధ్యులను చేయాల్సిందేనన్నారు. పిల్లలను పాఠశాలల్లో దండించక, తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఎలా తయారవుతారో చెప్పడానికి కొండమల్లేపల్లి ఘటన నిదర్శనమన్నారు. పాఠశాల స్థాయిలో దండించకపోతే రేపు మీ పిల్లలు కటకటాల్లో దండించబడతారన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు రమావత్ రమేశ్ నాయక్, నాయినీ మాదవరెడ్డి, చేనగోని శివగౌడ్, రమావత్ కళ్యాణ్‌నాయక్, కందికంటి విజయ్‌కుమార్, అంజినేయులు, నాగేంద్రబాబు పాల్గొన్నారు.