వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్నది.
మొదటి రోజు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో హోరాహరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా ఓట్లు నమోదవుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన తొలి రౌండ్ కౌంటింగ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మూడు రౌండ్ల కౌంటింగ్‌లో ఫలితం ఎవరి వైపు ఉంటుందోనని తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి తొలి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటా ఎవ్వరికీ వచ్చే అవకాశాలు లేవని కౌంటింగ్ కేంద్రంలోని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఎలిమినేషన్ రౌండ్లో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఎలిమినేషన్ రౌండ్ నిర్వహించాల్సి వస్తే శుక్రవారం ఉదయానికి గానీ తుది ఫలితం వెలువడే అవకాశాలు లేవు.
నల్లగొండ పట్టణ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో బుధవారం ఉదయం 8గంటల నుంచి పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనా దీప్తి, ఎన్నికల పరిశీలకులు రాహుల్ బొజ్జ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్‌ను ఓపెన్ చేశారు. మొత్తం నాలుగు హాల్స్‌లో కౌంటింగ్ జరుపుతున్నారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం ఏకకాలంగా నాలుగు హాల్స్‌లో 96 టేబుళ్లపై కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. కౌంటింగ్ టేబుళ్ల వారీగా ముందే పోలింగ్ కేంద్రాలను నిర్ణయించి వాటికి సంబంధించిన పోలింగ్ బాక్స్‌ను కేటాయించారు.
బుధవారం ఉదయం 8.30గంటల వరకు ముందుగా టేబుళ్లపై బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టే కార్యక్రమం షురూ చేశారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కో టేబుల్‌కు ఆరు పోలింగ్ బాక్స్‌లను వరుస క్రమంలో పంపిణీ చేశారు. ఒక్కో బాక్స్‌ను ఓపెన్ చేసి బ్యాలెట్ పత్రాలను ట్రేలల్లో కుమ్మరించి వాటిని 25 చొప్పున కట్టలు కట్టారు. ఇలా మొత్తం 3,36,013 బ్యాలెట్లను కట్టలు కట్టడానికే ఆరు గంటల సమయం తీసుకుంది. కట్టలు కట్టిన బండిల్స్‌ను ఆర్ఓ రూమ్‌లో డ్రమ్ముల్లోకి తరలించారు. అక్కడ అన్ని బండిల్స్ మిక్స్ అయ్యేలా జాగ్రత్త తీసుకున్నారు.
బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి అసలు లెక్కింపు మొదలైనట్లు లెక్క. 4 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును నాలుగు హాల్స్‌లో మొదలుపెట్టారు. ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్ల చొప్పున మొత్తం 96టేబుళ్లపై ఒకే సారి 96 వేల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ కార్యక్రమం ముందుగా ఒక్కో రౌండ్ లెక్కింపు రెండు గంటల్లో ముగించవచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా సాగింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగింది. దాదాపు ఒక్క రౌండ్‌కు కనీసం ఏడు గంటల సమయం తీసుకుంది.
అంటే ఇంకా తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు సంబంధించి మూడు రౌండ్ల లెక్కింపు జరుగాల్సి ఉంది. ఒక్కో రౌండ్‌కు కనీసం ఐదు గంటల సమయం తీసుకున్నా గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుధీర్ఘ సమయం తీసుకుంటుండడంతో షిఫ్టుల వారీగా కౌంటింగ్ సిబ్బందితో పాటు ఏజెంట్లను కూడా నియామకం చేశారు. అక్కడే భోజనం, అల్పాహారం, టీ, స్నాక్స్ లభించేలా ఏర్పాట్లు చేశారు.
తొలి ప్రాధాన్యత ఓట్ల తొలి రౌండ్లో కడపటి సమచారం ప్రకారం నువ్వా నేనా అన్నట్లుగా బిగ్ ఫైట్ నెలకొన్నట్లు తెలుస్తున్నది. మొత్తం 96టేబుళ్లపై కౌంటింగ్‌లో కొన్ని టేబుళ్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మెజార్టీ చూపుతుండగా మరికొన్ని టేబుళ్లపై కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యాన్ని చూపుతున్నట్లు సమాచారం.
దీంతో తొలి రౌండ్‌తో ఎటూ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నట్లు అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు చెప్పుకొచ్చారు. ఇక మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, నాల్లో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. వీరితో పాటు ఐదోస్థానంలో చెల్లని ఓట్లే ఉండనున్నట్లు కౌంటింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సారి గణనీయంగా చెల్లని ఓట్ల సంఖ్య ఉన్నట్లు సమాచారం. ఈ చెల్లని ఓట్లు ఎవరి కొంప ముంచుతున్నాయనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో తొలి రౌండ్‌తో కలిపి మిగతా రౌండ్లల్లోనూ ఇంతే టఫ్‌గా ఓట్లు పోలైతే తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేత తేలకపోవచ్చు.
ఎలిమినేషన్
తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక గెలుపు కోటా నిర్ధారణ చేస్తారు. చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్లను పరిగణలోకి తీసుకుంటూ అందులో 50శాతం ప్లస్ ఒకటిని గెలుపు కోటాగా నిర్ణయిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ ఈ గెలుపు కోటా రాకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్ రౌండ్లో చేపడతారు. ఇది జరుగాల్సి వస్తే గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాతనే జరుగనుంది. ఎలిమినేషన్ రౌండ్లో తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ వచ్చిన అభ్యర్థి నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇది పూర్తి కావాలంటే కనీసం మరో 12 గంటల సమయం తీసుకుంటుంది.
ఇదే జరిగితే శుక్రవారం ఉదయానికి తుది ఫలితం వెలువడవచ్చని భావిస్తున్నారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ను పరిగణలోకి తీసుకుంటే 90గంటల సమయం పట్టింది. ఈ సారి టేబుళ్లు అదనంగా ఏర్పాటు చేసినా త్వరగా జరుగుతున్న పరిస్థితి తొలి రోజు కనిపించలేదు. గురువారం ఉదయానికి తొలి ప్రాధాన్యత ఓట్ల తొలి రెండు రౌండ్ల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉండడంతో ఫలితాల సరళిపై మాత్రం కొంతవరకు స్పష్టత రానుంది.