తిరుమలగిరి, ఫిబ్రవరి 11 : ‘ఈ నెల 13న నల్లగొండలో కేసీఆర్ సభను అడ్డుకుంటామని జోకర్స్, బ్రోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ అనడం సిగ్గుచేటు. నల్లగొండ కేసీఆర్ అడ్డా, కేసీఆర్ అంటే త్రీ ఫేజ్ కరెంట్.. ముట్టుకుంటే మసైపోతారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బెదిరింపులు కొత్తకాదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం కదిలి వచ్చినా కేసీఆర్ సభను అడ్డుకోలేరు’ అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని కొట్లాడి తెచ్చుకున్నది ప్రధానంగా నీళ్ల కోసమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కృష్ణానీటిలో మన వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం రైతాంగాన్ని, ప్రజలను మోసం చేయడమేనన్నారు.
కాంగ్రెస్ నాయకులు తాము చేసిన ద్రోహాన్ని కప్పి పుచ్చేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సభను అడ్డుకునే దమ్ము ఎవ్వరికి లేదని అన్నారు. రైతుల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పేగులు తేగేవరకూ పోరాడుతామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ప్రతి పక్షంలో ఉన్నా, పాలక వర్గంలో ఉన్నా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ నెల 13న నల్లగొండలో జరిగే కేసీఆర్ సభకు 9 మండలాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ ఓటుకు నోటు దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకర మన్నారు. ట్రిబునల్ వేసి నీటి పంపకాలు చేయకుండా 9 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది మోదీ ప్రభుత్వం అని అన్నారు. కల్లుతాగిన కోతుల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ పూటకో మాట మాట్లాడుతూ కేసీఆర్ సభను అడ్డుకుంటామని అనటం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకోసం ప్రాణాలైన అర్పించే వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. సమావేశంలో రైతు బంధు సమితి మాజీ జిల్లా కోఆర్దినేటర్ రజాక్, ఎంపీపీ స్నేహలత, మున్సిపల్ చైర్పర్సన్ రజినీ, పీఏసీఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, నాగారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పలయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.