నేరేడుచర్ల, ఆగస్టు 14 : మండలంలోని పెంచికల్‌దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఒకరోజు ముందుగానే హాజరు రిజిష్టర్‌లో సంతకం చేశారు. ఇద్దరు సిబ్బందికి గైర్హాజరు, మరొకరికి సిక్ లీవ్ వేసిన వైనం చోటు చేసుకున్నది. పెంచికల్‌దిన్నె పీహెచ్సీ వైద్యాధికారి సీతామహాలక్ష్మి గురువారం విధులకు హాజరైనప్పుడు హాజరు రిజిష్టర్‌లో పెట్టాల్సిన సంతకాన్ని బుధవారమే పెట్టి వెళ్లారు.
అంతేకాకుండా మరో ఇద్దరు సిబ్బంది గైరాజరైనట్లు, మరొకరు సిక్ లీవ్‌లో ఉన్నట్లు, కొంత మంది సిబ్బంది పేర్ల ఎదురుగా పెన్నుతో చిన్న చిన్న చుక్కలు పెట్టారు. ఈ విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. వైద్యాధికారి సీతామహాలక్ష్మి లేరు.
ఇప్పుడే బయటకు వెళ్లారని సిబ్బంది తెలిపారు. వైద్య సిబ్బంది నాలుగు గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉండగా.. వైద్యాధికారి ముందే వెళ్లిపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమెరాలు పని చేయడం లేదు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలకు అందుబాటులో ఉండని వైద్యాధికారిపై చర్యలు తీసుకొని మరొకరిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ విషయమై జిల్లా వైద్యాధికారి కోటాచలానికి ఫోన్ చేయగా.. సమస్య తన దృష్టికి రాగానే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిజిష్టర్‌లో ఒకరోజు ముందుగానే సంతకం చేసిన ఫొటోను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌కు పంపగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ఈ డాక్టర్‌పై పలు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నామంటూ కాలయాపన చేశారు.