నల్లగొండ ప్రతినిధి, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేదెవరు.. ఓడేదెవరు? ఎక్కడెక్కడ ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది? కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది? ఆ ప్రభుత్వంలో రాష్ట్రం పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలపై నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. మంగళవారం దేశమంతటా పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏకకాలంలో మొదలు కానుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల ఫలితం సైతం తేలనుంది.
నల్లగొండలోని దుప్పలపల్లి సమీపంలో ఉన్న వేర్ హౌజింగ్ గోదాముల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం ఓట్ల లెక్కింపు, భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో భువనగిరి లోక్‌సభ స్థానం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. రెండు కౌంటింగ్ కేంద్రాల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. మూడంచెల పటిష్ట భద్రతతో పాటు వంద శాతం కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
గత నెల 13న జరిగిన పోలింగ్‌లో నల్లగొండ లోక్‌సభ స్థానంలో 12,77,137 ఓట్లు, భువనగిరి స్థానంలో 13,88,680 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ అనంతరం అన్ని చోట్ల నుంచి ఈవీఎంలను ఇటు నల్లగొండలోని దుప్పలపల్లి గోదాములకు, అటు భువనగిరి పరిధిలోని ఆరోరా ఇంజినీరింగ్ కాలేజీల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. ఇక్కడే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం లెక్కింపు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టినట్లు ఆర్ఓలు హరిచందన, హనుమంత్ కె.జెండగే ప్రకటించారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో చోట 2వేల పైచిలుకు సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరందరికీ పలు దఫాలుగా శిక్షణ ఇచ్చి అన్ని విధాలుగా సిద్ధం చేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలను బట్టి మొత్తం 22 నుంచి 24 రౌండ్లల్లో తుది ఫలితం వెల్లడి కానుంది. అధికారులు తెలిపిన ప్రకారం చూస్తే.. దేవరకొండ అసెంబ్లీ ఓట్ల లెక్కలు 24 రౌండ్లు, నాగార్జునసాగర్ 22రౌండ్లు, మిర్యాలగూడ 19, హుజూర్నగర్ 22, కోదాడ 22, సూర్యాపేట 20, నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి 21 రౌండ్లల్లో లెక్కింపు పూర్తి కానుంది. అంటే తుది ఫలితం రావాలంటే దేవరకొండకు చెందిన 24వ రౌండ్ కూడా పూర్తి కావాల్సిందే.
ఇలా లెక్కించేటప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఒక రౌండ్ ఫలితాన్ని ఒకచోట కలిపి రిటర్నింగ్ అధికారి లోక్‌సభ స్థానం ఫలితాన్ని ఒక్కో రౌండ్ వారీగా ప్రకటిస్తారు. అంతకంటే ముందు రిటర్నింగ్ అధికారి హాల్లో పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే.. వాటి ఫలితాన్ని సంబంధిత వీవీ ప్యాట్‌ను చివర్లో లెక్కించి తేలుస్తారు. ఉదయం 5:30 గంటలకే కౌంటింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు వారికి జారీ చేసిన ఎన్నికల కమిషన్ పాసులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇక పోలింగ్ సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికీ మంచినీరు, భోజన వసతి అక్కడే కల్పించారు.
నల్లగొండ లోక్‌సభ స్థానంలో మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి కందూరు రఘువీర్‌రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. భువనగిరిలో 39 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ మధ్య ప్రధాన పోటీ ఉంది. రెండు చోట్లా ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ ముగిసిన నాటి నుంచి పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల లెక్కలతో కుస్తీలు పట్టి ఉన్నారు. ఇక నేడు వెలువడనున్న అసలు ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠత అందరిలో నెలకొంది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది మరికొద్ది గంటల్లోనే స్పష్టత రానుంది.
మంగళవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ షురూ కానుంది. అంతకుముందే కౌంటింగ్ కేంద్రాలకు పోలింగ్ ఏజెంట్లు చేరుకుంటారు. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ సీల్ తొలగిస్తారు. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, తర్వాత ఈవీఎంలను కౌంటింగ్ హాల్స్‌కు తరలిస్తారు. ఒక్కో లోక్‌సభ స్థానం ఓట్ల లెక్కింపు కోసం ఎనిమిది హాళ్లను వినియోగిస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు హాళ్లు, మరొకటి పోస్టల్ బ్యాలెట్ల కోసం సిద్ధం చేశారు.
పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే హాల్లోనే రిటర్నింగ్ అధికారి టేబుల్ కూడా ఉంటుంది. ఒక్కో కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేసి.. ఒక్కో రౌండ్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 14 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంల్లోని ఓట్లను లెక్కిస్తారు. ఇలా మొత్తం ఒక్కో రౌండ్లో 98 ఈవీఎంల్లో నిక్షిప్తిమైన ఓట్ల లెక్క తేలనుంది. ఇలా లెక్కించేటప్పుడు తొలి రౌండ్ ఫలితం ఉదయం 9గంటల కల్లా రావచ్చని అంచనా వేస్తున్నారు.
తర్వాత సగటున ప్రతి 30 నిమిషాల్లో ఒక రౌండ్ లెక్కింపు పూర్తి కావచ్చని అంచనా. అయితే కంట్రోల్ యూనిట్లో బటన్ నొక్కితే ఎవరికి ఎన్ని ఓట్లు అనేది నిమిషాల్లో స్పష్టమైనా అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను నోట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోనుంది. మొత్తం అభ్యర్థుల ఓట్లతో పాటు నోటాకు వచ్చిన ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏడు అసెంబ్లీల ఓట్ల ఒకచోట వేసి లెక్క తేల్చాక ఆర్ఓ సంతకంతోపాటు ఎన్నికల పరిశీలకుడి ఆమోదం కూడా లభిస్తేనే ఒక్కో రౌండ్ వారీగా ఫలితం అధికారికంగా బయటకు రానుంది.