రామగిరి, చిట్యాల, అక్టోబర్ 10 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకొనే విజయదశమి వేడుకను శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. తెలంగాణ అతి పెద్ద పండుగ అయిన దసరాను సంబురంగా చేసుకునేందుకు ఊరూ వాడ సిద్ధమయ్యాయి. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్లు కూడా సొంతూళ్లకు రావడంతో గ్రామాల్లోనూ సందడి నెలకొంది. మరోవైపు కొత్త దుస్తుల కొనుగోళ్లతో శుక్రవారం మార్కెట్లు కిటకిటలాడాయి. శనివారం సాయంత్రం దసరా సందర్భంగా శమి పూజ నిర్వహించేందుకు అంతటా ఏర్పాట్లు చేసుకున్నారు.
విజయదశమి పండుగను శనివారం నిర్వహించుకోవాలని ధూప, దీప, నైవేద్య అర్చక పథకం రాష్ట్ర అధ్యక్షుడు, దౌలతాబాద్ వాసుదేవ శర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ విద్వత్సభ జిల్లా కన్వీనర్ పెన్నా మోహనశర్మలు వేర్వేరుగా ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వాహనాలతో విజయవాడ-హైదరాబాద్ హైవే కిటకిటలాడుతున్నది. రెండు రోజుల నుంచే రద్దీ విపరీతంగా ఉన్నా శనివారం మరింత కనిపించింది. చౌటుప్పల్, చిట్యాల పట్టణాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సూర్యాపేట టౌన్, అక్టోబర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. శమి పూజ చేసి జమ్మి ఆకును బంగారంగా స్వీకరించే గొప్ప సంస్కృతి తెలంగాణదని పేర్కొన్నారు. పాలపిట్ట, జమ్మి చెట్టును రాష్ట్ర చిహ్నాలుగా గుర్తించిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్చంద్ర పవార్, మాజీ ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్ వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.