అమరవీరుల కుటుంబాలకు అండగా సర్కారు ఉద్యోగాలిచ్చి, ఆర్థిక సాయం అందజేత ఉమ్మడి జిల్లాలో 67 మందికి వర్తింపు రాష్ట్రం ఏర్పడిన రెండేండ్లల్లోనే గుర్తింపు దశాబ్ది వేడుకల్లో నేడు అమర వీరుల సంస్మరణ దినోత్సవం నివాళులర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి తరలివెళ్లేందుకు సిద్ధం
ఆత్మ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో పాలన పగ్గాలు అందుకున్న ఉద్యమనేత కేసీఆర్ సర్కారు అమరుల కుటుంబాలకు అడుగడుగునా అండగా నిలుస్తూ ఆసరానిస్తున్నది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలను రాష్ట్రం ఏర్పాటైన రెండేండ్లలోనే అక్కున చేర్చుకుంది. అమరుల కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయగా..కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. 2016 జూన్ 2న రాష్ట్రం రెండో అవతరణ రోజునే దీన్ని పూరి చేసింది. అమరుల కుటుంబ సభ్యుల్లో కొందరికి చదువు, వయసు వంటి నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చి ఉద్యోగాలను కల్పించింది. ఇలా ఉమ్మడి జిల్లాలో మొత్తం 67 మంది అమరుల కుటుంబాలను ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంది. ఇదే సమయంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరులో అసువులు బాసిన అమరులకు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నది. అమరుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపేలా సాగుతున్న పాలనపై అమరుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన ఉద్యమ ట్యాగ్‌లైన్‌ను పరిపూర్ణం చేస్తూ సాగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులందరికీ నివాళులర్పించనున్నారు. హైదరాబాద్‌లో అత్యద్భుతంగా నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాల్సిందే అంటూ ఉరికొయ్యలకు ఉయ్యాలలూగిన వారు కొందరు.. జై తెలంగాణ నినాదాలు చేస్తూ అగ్నికీలల్లో ఆహుతైనవారు మరికొందరు.. తమ ప్రాణార్పణతోనైనా ప్రభుత్వాలు చలించాలంటూ నడి రోడ్డుపై అమరులైన వారు ఇంకొందరు.. ఒక్కరా..? ఇద్దరా..? రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ ఉద్యమంలో బలవంతపు ప్రాణార్పణలు చేసిన అమరులు అనేకం ఉన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు మాత్రమే కాదు.. నేటికీ అనునిత్యం రాష్ట్ర ప్రజల గుండెల్లో, పాలకుల మనసుల్లో, వారి ఆత్మత్యాగాలు ప్రజ్వలిస్తూనే ఉన్నాయి. అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వరాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్న ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. అనునిత్యం త్యాగధనుల ఆత్మత్యాగాల గురించి, వారి కుటుంబ సంక్షేమం గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వస్తున్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సాయంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించారు. మరోవైపు అమరుల త్యాగానికి ప్రతిరూపంగా రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామి దిశగా నడిపిస్తున్నారు. అమరుల ఆశయ సాధనలో భాగంగా పచ్చని, పరిపుష్టమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తున్నారు. కీలకమైన సాగు, తాగునీటి సమస్యలకు చెక్ పెడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నిధుల పరంగా దేశంలోనే అత్యధిక జీడీపీ రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు.
అమరుల త్యాగాలకు స్వరాష్ట్రంలో ప్రాధాన్యత కల్పిస్తామని ఉద్యమ సమయంలోనే చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలి ఎన్నికల్లోనే ఉమ్మడి జిల్లా నుంచే ప్రాధాన్యతకు అవకాశం కల్పించారు. రాష్ట్ర సాధన కోసం అగ్నికి ఆహుతైన కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్ అసెంబ్లీ టిక్కెట్ కేటాయించి.. హుజూర్నగర్ శాసనసభా స్థానం నుంచి బరిలో దించారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలైనా.. అఖండ విజయంతో గెలిచి సీఎంగా పాలనా పగ్గాలు అందుకున్న కొన్నాళ్లకే అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అమరవీరులుగా గుర్తించాలని జిల్లా నుంచి పలువురు దరఖాస్తు చేసుకోగా.. తొలి విడుతలో 48 మందికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఆ తర్వాత విడుతల వారీగా మొత్తం 67 మంది అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 26 మంది, సూర్యాపేటలో 8, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33 మంది అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయంతోపాటు ఉద్యోగాలు కల్పించింది.
-అమరుడు రామలింగయ్య భార్య రాములమ్మ
కట్టంగూర్, జూన్ 21 : ‘తెలంగాణ వస్తే మన పిల్లలకు ప్రభుత్వ కొలువులు వస్తయి. ఇక మన బతుకులు బాగుపడుతయి అని నా భర్త అంటుండేవాడు. ఇరుగు పొరుగు వారితో ఎప్పుడూ తెలంగాణ గురించి చెబుతుండేది. ఉద్యమాలు, దూంధాంలు ఏ ఊళ్లో జరిగినా పని వదులుకొని అక్కడికి వెళ్లి డప్పు చేతపట్టి దరువేసేవాడు. దీక్షా శిబిరంలో దరువేస్తూ పాట పాడుతూనే గుండె నొప్పితో కుప్పకూలాడు. ఇప్పుడు తన భర్త ఉంటే ఎంతో సంతోషించేవాడు.’ అని అమరుడు రామలింగయ్య భార్య రాములమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన గద్దపాటి రామలింగయ్య డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. డ్రైవింగ్ పని లేకపోతే తెలంగాణ ఉద్యమాలు ఎక్కడ జరిగినా వెళ్లేవాడు. 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ర్టాన్ని ప్రకటించి మళ్లీ వెనుకకు తీసుకోవడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పటికే కట్టంగూర్ మండల కేంద్రంలో పది రోజులుగా జరుగుతున్న దీక్షా శిబిరంలో రామలింగయ్య రోజూ పాల్గొనేవాడు. ఈ క్రమంలో 2009 డిసెంబర్ 30న దీక్షా శిబిరంలో దరువేస్తూ పాట పాడుతుండగానే గుండె నొప్పి రావడంతో కుప్పకూలాడు. నార్కట్‌పల్లి కామినేని దవాఖానకు తీసుకెళ్తుండగా మధ్యలోనే మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి దుఃఖసాగరంలో మునిగింది.
నా భర్త చనిపోయి ఇబ్బందుల్లో ఉన్న మా కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేసి, మా పెద్ద కొడుకుకు కొలువు ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాగానే అమరుల కుటుంబాలను ఆదుకున్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన ఎంతో బాగుంది. ఇంటి పెద్దను కోల్పోయి బాధలో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి సార్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– రాములమ్మ, అమరుడు రామలింగయ్య భార్య
మా కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి మిర్యాలగూడ పట్టణంలో డిగ్రీ చదువుతూ మలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. రాష్ట్రం ఆలస్యం కావడంతో తన చావుతోనైనా త్వరగా వస్తదని భావించి 2010 జనవరి 3న పురుగుల మందు తాగి ఆత్మబలిదానం చేసుకున్నాడు. 18ఏండ్ల కొడుకు లేకపోయేసరికి మాకు దిక్కెవరు దేవుడా అని చాలాకాలం పాటు తీవ్రంగా బాధపడ్డాం. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో బాధను దిగమింగుకుని బతుకుతున్న మాకు సీఎం కేసీఆర్ రూ.10లక్షల సాయం చేశారు. మా బిడ్డ లక్ష్మికి వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పించి మా కుటుంబానికి భరోసా ఇచ్చారు. మేము బతికి ఉన్నంతకాలం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– మైనంపాటి వెంకట్‌రెడ్డి, వెంకటమ్మ, చలకుర్తి, పెద్దవూర మండలం
పెద్దఅడిశర్లపల్లి : తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో ఆంధ్రా పాలకుల వైఖరికి నిరసనగా రాష్ట్ర ఏర్పాటు కోసం నా కొడుకు నరేశ్ ప్రాణత్యాగం చేశాడని బరువెక్కిన గుండెలతో చెప్పారు పీఏపల్లి మండలం పెద్దగట్టుకు చెందిన అమరుడు నరేశ్ తల్లిదండ్రులు హరియా, కోటి దంపతులు. ఎన్నో ఏండ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే ఉద్దేశ్యంతో తమ కుమారుడు ఆత్మబలిదానం చేశాడు. రాష్ట్రం ఏర్పడక ముందు మా కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో వీధిన పడింది. అప్పట్లో హరీశ్‌రావు మాకు అండగా నిలిచిండు, తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక వాళ్లు కూడా రూ.లక్ష ఆర్థికంగా సాయం చేసి ఎంతో భరోసా ఇచ్చారని దంపతులు చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ సార్ మా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడమే కాకుండా నా ఇంకో కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. నా కొడుకు ప్రాణత్యాగం వృథా కాలేదనే సంతోషం మాకు మిగిలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పోరాడడంతో పాటు మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగం కల్పించి నా కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నా రెండో కుమారుడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండు. ఆర్థికంగా ఇబ్బందులు అంటూ లేవు. తెలంగాణ వచ్చినంక రాష్ట్రంలో ఎంతో మంది బడుగుల జీవితాల్లో వెలుగులు వచ్చినయ్. సీఎం కేసీఆర్ సర్కార్‌కు మరోసారి పేదలంతా అండగా ఉంటారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆయన రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అమరులైన కుటుంబాలందరికీ న్యాయం చేశారు. చనిపోయిన నా కొడుకుని తీసుకురాలేకున్నా సీఎం కేసీఆర్ రూపంలో నా కొడుకును చూసుకుంటున్నా.
– నరేశ్ తల్లిదండ్రులు హరియా. కోమటి
రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని, సీమాంధ్రుల కుట్రల పట్ల కలత చెందిన మా కొడుకు పిల్లి గిరిబాబు 2014, ఫిబ్రవరి 19న వరంగల్ ప్రభుత్వ కళాశాలలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చివరి శ్వాస వరకు జై తెలంగాణ నినాదాలు చేస్తూ అమరుడయ్యాడు. గిరిబాబు ఆత్మబలిదానం చేసిన సాయంత్రమే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. స్వరాష్ట్రంలో అమరుల ఆశయాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ ఆ కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు మరో కొడుకు సైదులుకు ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పించింది. ప్రస్తుతం సైదులు కుటుంబ పోషణ బాధ్యతలు చూస్తున్నాడు. కొడుకు లేడన్న ఒక్క బాధ తప్ప మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వం ఆదుకుంది.
– పిల్లి రాములు, అమరుడు గిరిబాబు తండ్రి, ముకుందాపురం, నిడమనూరు మండలం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజు గురువారం అమరవీరుల దినోత్సవానికి ఏర్పాట్లు చేశారు. వాడవాడలా అమరులకు ఘనంగా నివాళులర్పించేందుకు ఉమ్మడి జిల్లా అంతటా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. అమరవీరుల స్మారక స్తూపాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 9 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు స్థానిక సంస్థల్లోనూ అమరులకు నివాళులు అర్పించనున్నారు. అమరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం హైదరాబాద్‌లో జరుగనున్న అమరుల స్మృతి చిహ్నం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.
ఆర్థిక సాయంతోపాటు అమరవీరుల కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అమరవీరుల కుటుంబ సభ్యుల విద్యార్హతలకు అనుగుణంగా వివిధ రకాల ఉద్యోగాలకు ఎంపిక చేశారు. కారుణ్య నియామక ప్రక్రియలో భాగంగా ఈ ఉద్యోగాలను ఇచ్చారు. అమరుల కుటుంబ సభ్యుల్లో వారు సూచించిన విధంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం దక్కింది. ఆ మేరకు 2016 జూన్ 2న రెండో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా వారందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైన నల్లగొండలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నియామక పత్రాలను అందించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.
అమరుల కుటుంబీకులకు ఉద్యోగాలు కల్పించే విషయంపై ప్రభుత్వం నిబంధనల్లో పలు సడలింపులు సైతం చేసింది. అమరులైన వారి భార్య, కుమారుడు, కూతురు, తల్లిదండ్రులకు ప్రాధాన్యత కల్పించారు. వారిలో అర్హులు లేకుంటే అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లతోపాటు వారు సూచించే ఇతర రక్త సంబంధీకులకు సైతం ఉద్యోగాలు ఇవ్వడం విశేషం. ఒకరిద్దరికి ఎలాంటి విద్యార్హతలు లేకున్నా.. నిబంధనల్లో పూర్తిస్థాయి సడలింపులు సైతం ప్రకటించింది ఆదుకుంది. విద్యార్హతలను బట్టి ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, అటెండర్‌తోపాటు అస్సలు చదువు రాని వారికి హాస్టళ్లలో కామాటి ఉద్యోగాలు కల్పించారు. వయసుతోనూ ఎలాంటి సంబంధం లేకుండా మినహాయింపునిచ్చారు. ఖాళీలు అనుకూలంగా లేనట్లయితే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించే విధంగా.. అప్పట్లో జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి తన నిబద్ధతను చూపింది.
‘నా భర్త మానోతు కోక్యా ఎప్పుడు చూసినా తెలంగాణ అంటూ కలువరించేటోడు. ఎక్కడ మీటింగ్‌లు పెట్టినా పనులు వదిలేసి పోయేటోడు. ఎన్ని సార్లు మొత్తుకున్నా వినిపించుకొనేటోడు కాదు. తెలంగాణ కోసం కొట్లాట బాగా జరుగుతుండగా ఇంటికాడ కూసోని ఎక్కువగా ఆలోచించేది. తెలంగాణ కోసం మండలంలో జరిగే అన్ని కొట్లాటల్లో ముందుగా ఉండాలని పోయేటోడు. ఇంటికాడ ఎన్ని పనులున్నా పట్టించుకోకపోయేది. చిన్న పిల్లలను వదిలేసి, ఎవుసాయాన్ని పట్టించుకోకుండా పోరాటంలో తిరిగేటోడు. ఒకరోజు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్న నాయకులను చూసి కోపం తెచ్చుకుండు. ఆవేశంతో నాయకులను తిడుతూ టీవీని పగులకొట్టిండు. చికాకుతో బయటికెళ్లి పురుగుల మందు తాగి పడిపోయిండు. దవాఖానకు తీసుకెళ్లినా బతుకలేదు. నాకు ఇద్దరు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. ఉన్నది రెండెకరాల మెట్ట భూమి. ఆయన చనిపోయిన కాన్నుంచి మాకు ఇబ్బందులు వచ్చినయి. ఇల్లు గడవడానికి కూలికి పోయాను. ఐదుగురు పిల్లలను సాకలేక ఇబ్బందులు పడ్డా. తెలంగాణ పార్టోళ్లు వచ్చి ధైర్యం చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు సర్కారు పది లక్షల రూపాయలు ఇచ్చింది. మా పెద్ద కొడుకుకు సర్కారు కొలువు ఇచ్చిండ్రు. సర్కారు ఆదుకోవడం వల్ల మా కుటుంబం నిలబడింది. ఆడపిల్లల పెండ్లి చేసినా. సర్కారు మంచిగా చేస్తుంది. మా ఆయన అనుకున్నది నెరవేరిందని సంతోషపడుతున్నం. మా కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్‌పై ప్రేమతో మంత్రి కేటీఆర్ పేరును నా మనువడికి పెట్టుకున్నాం.
మాది వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవిగూడెం. నా రెండో కూతురు ఇట్టమల్ల కవిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నా బిడ్డ విద్యార్థులతో కలిసి ఉద్యమంలో రోజూ పాల్గొనేది. అయితే.. రాష్ట్రం రాకపోవడంతో నా చావుతోనైనా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని 2014 ఫిబ్రవరి 2న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఉన్న నా కూతురిని ఉస్మానియా దవాఖానకు తరలిస్తే ఆరు రోజులు పోరాడి చనిపోయింది. కొన్ని రోజుల తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచారు. మా కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయంతోపాటు నా పెద్ద కూతురు స్వాతికి తాసీల్దార్ కార్యాలయంలో సబార్డినేటర్గా ఉద్యోగం కల్పించారు. బిడ్డను కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయి శోకసంద్రంలో ఉన్న మా కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే సీమాంధ్రుల పాలనలో ఆర్థికంగా నలిగిపోయేవాళ్లం.
మాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. తెలంగాణ ఉద్యమం పెద్దగా నడుస్తున్న రోజుల్లో మా పెద్ద కొడుకు నరసింహ ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రం గురించే చెప్పేటోడు. నల్లగొండలో ఏ మీటింగ్ ఉన్నా పోయేటోడు. తెలంగాణ రాదు.. రానివ్వం అంటూ ఆంధ్రోళ్లు చేసిన ప్రకటనతో కలత చెందిన మా కొడుకు నరసింహ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుండు. ఎదిగిన కొడుకు దూరమవడంతో ఎలా బతుకాలో అర్థంకాని సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మా కొడుకు కల సాకారమైంది. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక మా కొడుకు త్యాగాన్ని గుర్తించి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. నా చిన్న కొడుకుకు ఉద్యోగం ఇచ్చి మా కుటుంబానికి అండగా నిలిచారు. వచ్చిన పది లక్షలతో గతంలో ఉన్న కొంత అప్పు తీర్చడంతోపాటు గుండె ఆపరేషన్‌కు ఖర్చు చేశాం. నా బిడ్డ పెండ్లి చేస్తే ప్రభుత్వం కల్యాణలక్ష్మి కింద రూ.75 వేలు ఇచ్చింది. మా కొడుకు మాకు కన్నీరు మిగిల్చినా అన్ని రకాలుగా అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. కేసీఆర్ సార్ అమరుల కుటుంబాలకే కాకుండా ప్రజలందరినీ మంచిగా చూసుకుంటుండు.
పెన్‌పహాడ్, జూన్ 21 : ‘ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి. బడులు, కాలేజీలు అప్పుడప్పుడే బంద్ పెడుతున్నరు. 2010 జనవరి 19 సాయంత్రం 4 గంటలకు నా బిడ్డ వేణుగోపాల్‌రెడ్డి ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మార్పణ చేసుకున్నట్లు కబురు వచ్చింది. నా కొడుకు చనిపోవడం ఏంటని నమ్మలేకపోయా. తీరా అక్కడకు వెళ్తే కాలేజీ అంతటా కాలు తీసి కాలు పెట్టలేనంతగా పోలీసులు, విద్యార్థులతో నిండిపోయింది. చనిపోయింది మావాడేనా అనే అనుమానం. భయం కలిగింది. దుఃఖాన్ని ఆపుకోలేక చనిపోయింది నా కొడుకే అంటున్నరు.. చూడాలి సారూ.. అని పోలీసుల కాళ్లావేళ్లాబడి వెళ్లాను. చూస్తే నా కొడుకు నిలువునా కాలిపోయిండు’ సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన తెలంగాణ మలి దశ ఉద్యమ అమరుడు కొండేటి వేణుగోపాల్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ కంటతడి పెడుతూ తలుచుకున్న జ్ఞాపకాలివి. ‘కాలి మాడిపోయిన నా కొడుకు జీవితం తెలంగాణకు వెలుగులు ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం మంచిగా అయితున్నది. సీఎం కేసీఆర్ నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. నా చెల్లె కొడుకుకు ఉద్యోగం ఇచ్చిండు’ అంటూ నమస్తే తెలంగాణకు ఇలా చెప్పుకొచ్చింది.
నాకు ఇద్దరు కొడుకులు. నా పెద్ద కొడుకు కొండేటి శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీలో చదువు పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. రెండో కొడుకు వేణుగోపాల్‌రెడ్డి ఉస్మానియాలో చదువుకునేటోడు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ కొట్లాడుతున్నారు. ఫోన్ చేసినప్పుడు ఉస్మానియా కాలేజీలో ధర్నాల ముచ్చట్లు చెప్పేవాడు. ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్రం వస్తదో, రాదోనని మదనపడేవాడు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుండా ఆలస్యం చేస్తుండడంతో మనస్తాపానికి గురై 2010 జనవరి 19న ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మార్పణ చేసుకున్నడు.
కర్నల్ సంతోష్‌బాబు దేశం కోసం అశువులు బాసితే, నా కొడుకు వేణుగోపాల్‌రెడ్డి తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ అమ్మ కోరికను మన్నించి.. సూర్యాపేట పట్టణంలో నా కొడుకు వేణుది కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తే అది చూసి చనిపోవాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు లక్ష్మమ్మ.
వేణుగోపాల్‌రెడ్డి మృతితో తెలంగాణ అంతటా ఆందోళనలు, ఉద్రిక్తతలు జరిగాయి. కొండేటి ప్రాణ త్యాగం వృథా కానివ్వకుండా తెలంగాణ సాధించుకొని తీరుతామని ప్రతిన బూనారు. కానీ.. మా కుటుంబాన్ని ఎవరూ ఆదుకోలేదు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నా కొడుకు ఆత్మత్యాగానికి పాల్పడ్డాడే తప్ప ఆత్మహత్య చేసుకోలేదు. అయితే.. అప్పుడు శవం మీద ప్రమాణాలు చేసిన నాయకులెవరూ మమ్మల్ని ఆదుకోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే మాకు న్యాయం జరిగింది. అమరుల కుటుంబాలను అన్నితీర్ల ఆదుకుంటున్నారు. మాట ఇచ్చినట్టే నాకు రూ.10లక్షలు ఇస్తే ఊళ్లో ఇల్లు కట్టుకున్నా. కొంత భూమి కొనుక్కున్నా. నా చెల్లె కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారు. నేడు తెలంగాణ ప్రజల సంతోషంలో నా కొడుకు వేణుగోపాల్‌రెడ్డిని చూసుకుంటున్నా.