గర్వించేలా.. జగమంతా కనిపించేలా.. చరిత్రలో నిలిచిపోయేలా.. ప్రపంచమే అబ్బురపడేలా.. మహోన్నత మూర్తికి సమున్నత నివాళికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున దేశంలోనే అతి పెద్దదిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆయన జయంతి సందర్భంగా జాతి గర్వించేలా ఘనంగా నివాళులర్పిస్తూ 125 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఉత్సవాల్లో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వమే అధికారికంగా ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 3600 మంది తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో రవాణా, భోజనాలు, ఇతర వసతులపై ప్రత్యేక అధికారులు పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం 1గంట వరకు బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ స్థలానికి చేరుకునేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి వివిధ వర్గాల మేథావులు, దళిత నేతలు, ఇతర ప్రముఖులు తరలివచ్చేలా చర్యలు చేపట్టారు.
– నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్13(నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, ఏఫ్రిల్13(నమస్తే తెలంగాణ) : దళితుల సంక్షేమం, ఆర్ధికాభివృద్ధి పట్ల దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలు అమలులో ఉన్నాయి. వీటికి కొనసాగింపుతో పాటుగా భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని నలుదిశలా చాటిచెప్పేలా దేశం గర్వించదగ్గ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త సచిలవాలయానికి అంబేద్కర్ పేరు పెట్టింది. ఇక దానికి కొద్ద్ది దూరంలోనే హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తున భారీ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. కార్యక్రమంలో ప్రముఖులందర్నీ భాగస్వాములు చేయాలని నిర్ణయించింది. అందుకే ప్రభుత్వం తరుఫున క్షేత్రస్థాయి వరకు ఆహ్వానాలను పంపింది. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కూడా 3600 మంది వరకు స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత మేధావులు, ప్రముఖులు హైదరాబాద్‌కు తరలివెళ్లనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది వరకు వెళ్లేలా జాబితా సిద్ధం చేశారు. ప్రతి మండలం నుంచి 50 మంది చొప్పున జాబితాలను రూపొందించి వారందరికీ సమాచారం అందించారు. తరలి వెళ్లడానికి వీలుగా ప్రతి మండల కేంద్రం నుంచి ఒక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. ఏర్పాట్లన్నీంటినీ ఆయా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తూ నియోజకవర్గాల వారీగా సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
విగ్రహావిష్కరణకు తరలివెళ్లే వారి కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మండలాల నుంచి వెళ్లే వారంతా మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే అల్పాహారం చేసి బస్సు ఎక్కేలా ఏర్పాట్లు చేశారు. మధ్యలో హైదరాబాద్ పరిసరాల్లో జిల్లాల వారీగా ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి మధ్యాహ్న భోజన వసతిని కల్పించారు. వేసవి కావడంతో పార్సిల్ భోజనాలు కాకుండా ఫంక్షన్హాల్స్లోనే భోజనాలు వండిస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం ఒంటి గంట వరకు విగ్రహావిష్కరణ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటివి కూడా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. తిరిగా రాత్రి వారి మండలాల్లో డ్రాప్ చేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో బస్సులో పర్యవేక్షణకు ఒక లైజన్ ఆఫీసర్, వీఆర్ఏ, కానిస్టేబుల్ ఉంటారు. బస్సులకు స్టిక్కర్, బ్యానర్లను అంటించనున్నారు. అందులో జిల్లా, నియోజకవర్గం, బస్సు నంబర్లు ఉంటాయి. ఇదే సమాచారంతో కూడిన వివరాలు కూడా అందరికీ బుక్లెట్ రూపంలో ఇవ్వనున్నారు. ఈ వివరాలు గురువారం కలెక్టరేట్లో సంబంధిత లైజన్ ఆఫీసర్లకూ అందించారు. మండలం కేంద్రం నుంచి బయల్దేరి తిరిగి సాయంత్రం వచ్చే వరకు వీరిదే భాధ్యత. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాస్థాయి నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.
మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షణ..
మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేటాయించిన రూట్‌మ్యాప్ ద్వారా నెక్లెస్ రోడ్డు జలవిహార్ వద్ద పార్కింగ్ స్థలం వద్దకు చేరుకోవల్సి ఉంటుంది. సభ పూర్తయ్యే వరకు ఏ ఒక్కరు కూడాప్రాంగణం వీడకుండా లైజనింగ్ అధికారి పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు.
జిల్లా ముఖ్యులంతా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్యులందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఉమ్మడి జిల్లా నుంచి వీరంతా అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం జిల్లాల్లో స్థానికంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌లోని కార్యక్రమానికి తరలివెళ్లేలా షెడ్యూల్ సిద్ధమైంది.
హైదరాబాద్‌లో బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ సభకు సూర్యాపేట జిల్లా నుంచి 24 బస్సుల్లో ప్రజలను తరలించనున్నట్లు అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. గురువారం వెబ్ఎక్స్ ద్వారా సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. ఒక్కో నియోజక వర్గానికి ఆరు బస్సుల చొప్పున 1200 మందిని హైదరాబాద్‌కు తరలించనున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటలకు బస్సు బయల్దేరేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి బస్సులో ఒక లైజనింగ్ అధికారి, పోలీస్ అధికారి, వీఆర్ఏ ఉండాలని, భోజన ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, జడ్పీ సీఈఓ సురేశ్, డీఆర్డీఓ కిరణ్‌కుమార్, ఆయా మండలాల తాసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.