దామరచర్ల మండలంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో తొమ్మిది నెలల్లో వెలుగులు అందించేందుకు సిద్ధమవుతున్నది. రూ.29,965.48 కోట్లతో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనులు చేపట్టగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఐదు యూనిట్లలో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తికాగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగతా యూనిట్లు 70 శాతం పూర్తికాగా వీటిని 2024లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక్కో యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ప్లాంట్‌లో జెన్కో, బీహెచ్సీఈఎల్ కార్యాలయాలు, క్యాంటీన్, పైర్స్టేషన్తోపాటు యాశ్ప్లాంటు, నీటి నిల్వ కోసం రిజర్వాయర్‌ను నిర్మించారు. బొగ్గు సరఫరాకు రైల్వే ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పవర్ ప్లాంట్‌కు వస్తున్నారు. పనుల పురోగతి తెలుసుకొని వేగవంతం చేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు.
దామరచర్ల, నవంబర్ 27 : సమైక్య రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో తెలంగాణ అనేక ఇబ్బందులు పడింది. బోరు, బావుల ద్వారా వ్యవసాయం చేసుకున్న రైతులు నాణ్యమైన కరెంటు లేక, అప్రకటిత కోతలతో అనేక అవస్థలు పడ్డారు. పంట చేలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నదాతల ఇబ్బందులను చూసిన కేసీఆర్ రాష్ట్రం సాధించిన తొలి రోజుల్లోనే విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 2015 జూన్ 8న నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో రూ.55వేల కోట్లతో 7500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కొన్ని అడ్డంకుల వల్ల 4వేల మెగావాట్లకు కుదించారు. 2017లో 4,876 ఎకరాల్లో 4వేల మెగావాట్ల పవర్‌ప్లాంటు నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పనులను టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో చేపడుతుండగా.. ప్లాంటు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు అప్పగించారు. ఇందులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు, ఎంక్రోచ్మెంట్స్కు సైతం నష్టపరిహారం అందించారు. రెండు తండాలకు ప్రత్యేక ఆర్ఎన్ఆర్ కింద ఇండ్లు మంజూరు చేశారు.
శరవేగంగా కొనసాగుతున్న పనులు
తెలంగాణలో విద్యుత్ సమస్యను అధిగమించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుపాలన్న లక్ష్యంతో చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణానికి ఆది నుంచీ అడ్డంకులు సృష్టించారు. అయినా.. అన్నింటినీ అధిగమించి ప్లాంటు పనులు చేపట్టారు. ఇప్పటికే 800 మెగావాట్ల సామర్థ్యం గల 1, 2 యూనిట్లు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో 1వ యూనిట్, డిసెంబర్లో 2వ యూనిట్‌ను ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. 70 శాతం నిర్మాణ పనులు పూర్తయిన 3, 4, 5 యూనిట్లలో 2024లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్లాంటుకు కావాల్సిన పవర్ జనరేటర్లు, చిమ్నీలు, బాయిలర్స్, కూలర్లు, సూపర్ క్రిటికల్ స్టీమ్ టర్బైన్ జనరేటర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో నిత్యం 6వేల మంది ఇతర రాష్ర్టాల కార్మికులు పని చేస్తున్నారు. ప్లాంటులో జెన్కో, బీహెచ్ఈఎల్ కార్యాలయాలు, క్యాంటిన్, ఫైర్ స్టేషన్ నిర్మాణాలు పూర్తయ్యాయి. అతిథి గృహాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పవర్ ప్లాంటుకు అవసరమైన యాశ్ ప్లాంటు, నీటి నిల్వ కోసం రిజర్వాయర్‌ను పూర్తి చేశారు. సమీప కృష్ణానది నుంచి పైపులైన్ ద్వారా నీటిని తీసుకుంటున్నారు. సమీప అన్నవేరు వాగు వెంట గ్రీనరీని ఏర్పాటు చేయనున్నారు.
రూ.400 కోట్లతో రైల్వే లైన్
పవర్ ప్లాంటుకు అవసరమయ్యే బొగ్గు సరఫరా కోసం సమీప జాన్‌పహాడ్, విష్ణుపురం రైల్వే స్టేషన్ల పరిధిలో రూ.400 కోట్లతో సుమారు పది కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. ప్లాంటు వరకు నాలుగు లైన్ల నిర్మాణం చేస్తున్నారు. పవర్ ప్లాంటుకు ప్రతి రోజు 14 బోగీల బొగ్గు అవసరం ఉంటుంది. సింగరేణి నుంచి రైల్వే వ్యాగిన్ల ద్వారా బొగ్గు సరఫరా చేయనున్నారు. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.