నల్లగొండ, నవంబర్ 30 : ‘మీకు గ్యాస్ రావాలంటే మ్యాండేటరీ ఫీజుతోపాటు కలెక్షన్ ఎమౌంట్ ఇవ్వాలి.. అది కూడా పెద్దగా లేదులే.. ఒక్క సిలిండర్‌కు జస్ట్ రూ.236’ ఇది నల్లగొండ జిల్లాలో హెచ్‌పీ గ్యాస్ సిబ్బంది పేరుతో ఒక బృందం నుంచి వినిపిస్తున్న మాట. అదేంటి రెగ్యులర్‌గా గ్యాస్ డబ్బులు ఇస్తున్నాము కదా అనుకుంటే నడవదు. ఈ డబ్బులు ఇస్తేనే ఇక నుంచి మీకు గ్యాస్ డెలివరీతోపాటు బీమా, రూ.500 వస్తాయి అనే మాట వినపడడంతో.. తప్పని సరిగా వినియోగదారులు ఇవ్వక తప్పడం లేదు. ఇది వారం పది రోజుల నుంచి జిల్లాలో హెచ్‌పీ గ్యాస్ యాజమాన్యం చేస్తున్న గారడి. దీన్ని వినియోగదారులు గుర్తించి ఎదిరించి హెచ్ గ్యాస్ యాజమాన్యంతో మాట్లాడితే తాము చెప్పలేదనే సమాధానం ఎదురైనట్లు పలువురు వినియోగ దారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు ఎంతో మంది మహిళలు డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు తెలుస్తుంది..
1.85 లక్షల మంది వినియోగదారులు
జిల్లాలో 4.70 లక్షల మంది ఎల్పీజీ గ్యాస్ గ్యాస్ కనెక్షన్ దారులు ఉండగా అందులో హెచ్‌పీ గ్యాస్‌కు సంబంధించి 1.85 లక్షల మంది ఉన్నారు. గ్యాస్ రావాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరి ఫీజుతోపాటు ఇతర ఖర్చులు చెల్లించాల్సిందేనని యాజమాన్యం చెప్తుందని అందులో పని చేస్తున్న సిబ్బంది అంటున్న పరిస్థితి. ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్‌ను రూ.874కే ప్రభుత్వం ఇవ్వడంతోపాటు కొందరికి ఉచిత గ్యాస్ పేరుతో రూ.500 తిరిగి చెల్లిస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమకు కనీసం మరో రూ.50 సిలిండర్‌కు ఇవ్వాలనే డిమాండ్ సిబ్బంది చేయటంతో తప్పలేక వినియోగా దారులు ఇవ్వక తప్పడం లేదు. దీని పేరుతో వసూళ్లు జరుగుతున్నట్లు జిల్లా సివిల్ సప్లయ్ యంత్రాంగం గుర్తించి పలు గ్యాస్ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి..
మా దృష్టికి రాలేదు
హెచ్‌పీ గ్యాస్ వారు అనధికారికంగా మ్యాండేటరీ పేరుతో వినియోగ దారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. దీనిపై వెంటనే విచారణ చేసి వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ నిబంధనలకు లోబడే గ్యాస్ సరఫరా చేయాలి. కానీ దానికి సంబంధించిన జీఓ ఇప్పటి వరకు మాకు రాలేదు. ఇదిలా ఉండగా హెచ్‌పీ గ్యాస్ నిర్వాహకురాలు చంద్ర కళను వివరణ కోరితే సమాధానం దాటవేశారు.
– వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ
డబ్బులు వసూలు చేయడం సరికాదు
మాకు ఉజ్వల పేరుతో గ్యాస్ సిలిండర్ వచ్చింది. నెలకు సబ్సిడీ వస్తుందో రావటం లేదో అర్థం కావడం లేదు. అయినా డబ్బులు కట్టి సిలిండర్ తెచ్చుకుంటున్నాం. ఈ రోజు మ్యాండేటరీ పేరుతో డబ్బులు ఇవ్వాలని ఇద్దరు వ్యక్తులు మా ఇంటికి రావడంతో అడిగాం. వాళ్లు సమాధానం చెప్పకపోవడంతో హెచ్‌పీ గ్యాస్ వాళ్లకు ఫోన్ చేశాం. వాళ్లు కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. డబ్బులు తీసుకునే వాళ్ల దగ్గర హెచ్‌పీ గ్యాస్ లబ్ధిదారుల జాబితాతో పాటు అనేక మంది డబ్బులు కట్టిన రసీదులు ఉన్నాయి.
– పాలకూరి రమాదేవి. గృహిణి, నల్లగొండ