రామగిరి, డిసెంబర్ 22: విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంచేందుకు విద్యాశాఖ, సమగ్రశిక్ష ద్వారా వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా టీఎల్ఎం(టీచర్ లెర్నింగ్ మెటీరియల్) మేళాకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా మేళాను నిర్వహిస్తుండగా ఉమ్మడి జిల్లాలో అందుకు కావాల్సిన ఏర్పాట్లును విద్యాశాఖ పూర్తి చేసింది.
బోధన సామగ్రి తయారీ
బోధన ప్రక్రియలో మార్పులు తీసుకువచ్చి అందుకు అవసరమైన సామగ్రిని తయారు చేసేలా ఉపాధ్యాయులను సిద్ధం చేసేలా విద్యాశాఖ-సమగ్రశిక్ష ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఎఫ్ఎల్ఎన్, తొలిమెట్టులో భాగంగా ప్రతి టీచర్ ఆయా సబ్జెక్టుల్లో టీఎల్ఎంను ప్రదర్శించే అవకాశం కల్పించారు. ఈ నెల 28న మండల స్థాయిలో, జనవరిలో జిల్లాస్థాయిలో నిర్వహించి అందులో ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాకయిలో ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు.
టీఎల్ఎం ఆవశ్యకత
అర్ధవంతమైన అభ్యసనకు టీఎల్ఎం దోహదం చేస్తుంది. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ప్రత్యక్ష అనుభవం కలిగిలా భోదననాభ్యసన ప్రక్రియను నిర్వహించడం వల్ల అభ్యసన వేగవంతం అవుతుంది. సామగ్రిని ఉపయోగించడం వల్ల ఉపాధ్యాయులకు శ్రమ తగ్గడంతో పాటు పిల్లలకు విషయం పట్ల అవగాహన పెరుగుతుంది. వారిలో చదువుపట్ల ఆసక్తి పెంచవచ్చు. విషయాన్ని పిల్లలు గుర్తుంచుకుంటారు. వారు ఆడుతూ, పాడుతూ నేర్చుకుంటారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు బహుళ తరగతి బోధన చేస్తుండంతో టీఎల్ఎం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఉత్తమ టీఎల్ఎం ఎంపిక ఇలా..
టీఎల్ఎం మేళాలో ప్రదర్శించిన సామగ్రిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి జిల్లాకు అక్కడి నుంచి రాష్ట్రస్థాయికి పంపిస్తారు. అయితే ప్రదర్శనలో ఉపయోగించిన సామగ్రికి 40 మార్కులు ఉంటాయి. వాటిలో ఉపయోగించిన సామగ్రికి 10 మార్కులు, తయారు చేసిన విధానానికి 10, అభ్యసన ఫలితాల తోడ్పాటుకు 10, బహుళ ప్రయోజనాలకు 10 మార్కులు కేటాయిస్తారు. ఇలా ఆయా అంశాలల్లో నిపుణులైన న్యాయనిర్ణేతలు ఉత్తమ టీఎల్ఎంను జిల్లా స్థాయికి, ప్రతి సజ్జెక్టు నుంచి 5 అంశాలను ఎంపిక చేశారు.
మండల స్థాయి కమిటీలు
మండల స్ధాయిలో జరిగే టీఎల్ఎం ప్రదన్శన కోసం కమిటీలను వేశారు. ఎంఈవోలు, తొలిమెట్టు మండల నోడల్ అధికారులు సమన్వయంతో వీటిని పర్యవేక్షణ చేస్తారు. వీటిలో అవసరాల కమిటీ, ఆహ్వాన కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ, న్యాయ నిర్ణేతల కమిటీ, డాక్యుమెంటేషన్ అంశాల్లో నియమించారు. దాంతో పాటు ప్రదర్శనలో ఏర్పాటు చేసే స్టాల్స్‌కు ప్రముఖ కవి, శాస్త్రవేత్త, ప్రముఖుల పేర్లు పెట్టాలని ఎస్సీఈఆర్టీ సూచించింది.
సద్వినియోగం చేసుకోవాలి
విద్యాశాఖ ఆదేశాలతో నిర్వహిస్తున్న టీఎల్ఎం ప్రదర్శనలో ఉపాధ్యాయులు పాల్గొన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు సులభంగా బోధన చేయడానికి టీఎల్ఎం ఎంతో దోహద పడుతుంది. మరో వైపు విద్యార్థులు ప్రత్యేక అనుభాలు పొంది ఆయా సబ్జెక్టుల్లోని అంశాలను గుర్తుంచుకుంటారు. మండల స్థాయిలో ఈ నెల 28న నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేసేలా ఎంఈఓలకు, ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ అధికారికి సూచనలు చేశాం.
– ఆర్. రామచంద్రయ్య, తొలిమెట్టు కోఆర్డినేటర్, సెక్టోరియల్ అధికారి