తుంగతుర్తి, డిసెంబర్ 16 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మంజూరైన వంద పడకల ఆస్పత్రి పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆస్పత్రి ఎదుట పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో అప్పటి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొట్లాడి రూ.45 కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి మంజూరు చేయించి శంకుస్థాపన చేయించారని తెలిపారు.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినంక ఆస్పత్రి పనులు నత్త నడకన సాగుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మందుల సామేల్ వెంటనే చొరవ తీసుకుని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి కాంట్రాక్టర్ కు నిధులు ఇప్పించి ఆగిన పనులను వెంటనే ప్రారంభించి ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, దొంగరి శ్రీనివాస్, శ్రీనివాస్, రమేశ్, తప్పెట్ల యల్లయ్య, మాతంగి కరుణాకర్, మేడుదల రమేశ్, చింతకుంట్ల మనోజ్, మట్టిపెల్లి వెంకట్, కడారి దాసు, వీరోజీ నాయక్, రాములు నాయక్, బర్ల సోమన్న, మల్యాలా రాములు, మల్లెపాక రాములు పాల్గొన్నారు.