పరస్పర సహకారంతో ఒక్కటిగా నిర్వహణ
లాభాన్ని సమంగా పంచుకుంటున్న స్నేహితులు
బొటిక్, మగ్గం డిజైన్లకు విదేశాల స్వయం ఉపాధి
పొందుతున్న మహిళలు
మగ్గం వర్క్‌లో మరికొంత మందికి ఉపాధి
మిర్యాలగూడ టౌన్, మే 22 : వారు పదేండ్ల క్రితం మంచి స్నేహితురాళ్లు. అందరూ డిగ్రీ పూర్తి చేసి గృహిణులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇరుగు పొరుగున ఉంటున్న ఆ మహిళలు.. ఎవరు ఏ వస్తువు కొనాలన్నా మార్కెట్‌కు సరదాగా కలిసి వెళ్లేవారు. ఆ సమయంలో వారికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. అదే వారికి ఉపాధి అయ్యి.. వారి జీవితాలను మలుపు తిప్పింది. దూరం వెళ్లి ఇబ్బందులు పడే దానికంటే మనమున్న ప్రాంతంలోనే డ్రెస్ మెటీరియల్, మగ్గం వర్క్ షాపు పెట్టుకొని స్వయం ఉపాధి పొందుదామనే ఆలోచన చేశారు. వేర్వేరు షాపులను పక్కపక్కనే ఏర్పాటు చేసుకొని పరస్పరం సహకరించుకుంటూ ఉమ్మడిగా ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలిచారు మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన తిప్పన రూప, బాణాల ఉమారాణి, ఉస్తెల శాంతి.
ఉమ్మడిగా మూడు వ్యాపారాలు..
మిర్యాలగూడ హౌసింగ్‌బోర్డు కాలనీలో పక్క పక్క ఇండ్లల్లో ఉండే రూప, ఉమారాణి, శాంతి మంచి స్నేహితులు. షాపింగ్‌కు తరచూ కలిసి వెళ్లే వీరు.. కాలనీలోనే మహిళలకు అవసరమైన బట్టల షాపు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో అందులోని ఒకరు మగ్గం వర్క్‌షాపును, మరొకరు డ్రెస్ మెటీరియల్ అమ్మకం, ఇంకొకరు కుట్టు మిషన్ షాపును ఎంచుకున్నారు. వాటిని ప్రారంభంలో పక్కపక్కనే వేర్వేరుగా నిర్వహించేవారు. బేదాభిప్రాయాలు రాకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లారు. కొద్ది కాలానికి ముగ్గురి వ్యాపారాలను ఒక్కటిగా చేసుకొని వచ్చే లాభాన్ని ప్రతి నెలా సమంగా పంచుకుంటున్నారు. పదేండ్ల నుంచి నాణ్యమైన, నమ్మకమైన సేవలందిస్తుండడంతో రోజురోజుకూ గిరాకీ పెరుగుతున్నది. పట్టణం నుంచే కాకుండా జిల్లా, రాష్ట్రం, విదేశాల నుంచి సైతం వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. బొటిక్, మగ్గం వర్క్ కోసం హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు వెళ్లకుండా మిర్యాలగూడ పరిసర ప్రాంత మహిళలకు నాణ్యమైన, తక్కువ ధరతో అదే తరహాలో, దానికి మించిన డిజైన్లు అందిస్తున్నారు.
అంతా కోల్‌కతా వర్కర్లే..
వీరి వద్ద 20మంది కోల్‌కతా నుంచి వచ్చిన వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి ఉచిత బస, గృహ అవసరాలు అన్నీ చూసుకోవడంతోపాటు పనికి తగిన వేతనం వారం వారం అందిస్తున్నారు. కొత్త కొత్త డిజైన్లతో మగ్గం వర్క్, వివిధ ఆకృతుల్లో స్టిచ్చింగ్ చేయడం వల్ల వీరి వ్యాపారం విదేశాలకు సైతం విస్తరించింది. విదేశాల నుంచి మొబైల్ ద్వారా డిజైన్ పంపిస్తే వారికి నచ్చే విధంగా దానిని స్టిచ్చింగ్ చేసి పోస్ట్ ద్వారా పంపుతున్నారు. నెలకు ఐదు రూ.లక్షల వరకు వ్యాపారం సాగుతున్నదని, పెండ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్లో ఇంకా ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు. వేతనాలు, ఖర్చులన్నీ పోను నెలకు లక్ష వరకు మిగులుతుందని చెప్పారు.
12మందికి ఉపాధి కల్పిస్తున్నా..
నేను డిగ్రీ వరకు చదివాను. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్‌లో వీడియోలు చూసి చీరెలు, జాకెట్లపై డిజైన్లు వేయడం నేర్చుకున్నా. ఆ తర్వాత తమ స్నేహితుల సహాయంతో ఆరి, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్, మగ్గం పని చేస్తున్నా. రూ.500 నుంచి రూ.15వేల వరకు డిజైన్లు వేయించి హైదరాబాద్, విదేశాలకు సైతం పంపుతాం. నేను ఉపాధి పొందుతూ మరో 12మందికి ఉపాధి కల్పిస్తున్నా. వర్కర్లకు నెలకు రూ.2లక్షల వరకు వేతనం ఇస్తున్నా.
– తిప్పన రూప, మగ్గం వర్క్ నిర్వాహకురాలు, మిర్యాలగూడ
ఫ్యాషన్ డిజైన్‌పై ఆసక్తితో..
నేను ఎంబీఏ పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఉన్న ఆసక్తితో అదే రంగాన్ని ఎంచుకున్నా. నా స్నేహితుల సహకారంతో బొటిక్‌ను పెట్టాను. నా దగ్గర కోల్‌కతాకు చెందిన ఐదుగురు పని చేస్తున్నారు. ఆన్లైన్లో సైతం ఆర్డర్లు తీసుకొని వారికి నచ్చే విధంగా స్టిచ్చింగ్ చేయించి పంపిస్తున్నా. స్నేహితుల సహకారం, ప్రోత్సాహంతో వ్యాపారంలో రాణిస్తున్నా.
– బాణాల ఉమారాణి, బొటిక్ నిర్వాహకురాలు, మిర్యాలగూడ
స్నేహితుల ప్రోత్సాహంతో డ్రెస్ మెటీరియల్స్ విక్రయం
నేను డిగ్రీ వరకు చదువుకున్న. చిన్నప్పుడే మిషన్ కుట్టడం నేర్చుకున్నా. పెండ్లి అయిన తర్వాత హౌసింగ్‌బోర్డులో ఉంటున్న సమయంలో స్నేహితులు ఉమారాణి, రూపతో కలిసి వ్యాపారం ప్రారంభించాను. హైదరాబాద్, కోల్‌కతా నుంచి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొవచ్చి విక్రయిస్తుంటాం. ఉప్పాడ నుంచి ఫ్యాన్సీ చీరెలు, లాంగ్‌ఫ్రాక్ మెటీరియల్, పలు డిజైనింగ్ క్లాత్‌లు తీసుకొస్తాం. పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు. గిరాకీ బాగా ఉంటుంది.
– ఉస్తెల శాంతి, డ్రెస్ మెటీరియల్ విక్రయదారు, మిర్యాలగూడ