నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 27 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వాణిజ్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్లో నిర్వహించే ”అకాడమిక్ రైటింగ్” మూడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. కార్యక్రమం కరపత్రాలను, బ్రోచర్లను వర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవితో కలిసి గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంతో ఉపయోగపడే శిక్షణను అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు ధీటుగా మహాత్మాగాంధీ యూనివర్సిటీని విద్యతో పాటు కో కరిక్యులంలో అభివృద్ధి చేయడం లక్ష్యంగా అందరి సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆ దిశగా యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులు సైతం నైపుణ్యాలు పెంచుకుని ఉత్తమ బోధన సాగిస్తూ పరిశోధన అంశాల్లో శిక్షణ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్ సహకారంతో ఏప్రిల్ 18 నుంచి 20 వరకు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రెసిడెన్షియల్ విధానంలో అకాడమిక్ రైటింగ్ పై శిక్షణ నిర్వహిస్తున్నట్లు శిక్షణ కన్వీనర్ ప్రొఫెసర్ ఆకుల రవి తెలిపారు. దీనికి దేశవ్యాప్తంగా 30 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. సోషల్ సైన్స్ విభాగంలో పీహెచ్డీ స్కాలర్స్ (పరిశోధన విద్యార్థులు), యువ అధ్యాపకులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు పలు యూనివర్సిటీల సీనియర్ ప్రొఫెసర్లు హాజరై పలు అంశాల్లో శిక్షణ అందిస్తారని తెలిపారు.
శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకుని హాజరయ్యే వారికి పరిశోధనల నిర్వహణ, పరిశోధన పత్రాల ప్రచురణ, పరిశోధన గ్రంథాల రూపకల్పన, సమాచార సేకరణ, విశ్లేషణ, డేటా ఇంటర్ప్రిటేషన్, డాటా అనాలసిస్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో శిక్షణ కో కన్వీనర్, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి, వాణిజ్యశాస్త్రం విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలకంఠం శేఖర్, పీడీఎఫ్ పరిశోధన విద్యార్థి, నల్లగొండ ఉమెన్స్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ కోసనోజు రవిచంద్ర పాల్గొన్నారు.