సూర్యాపేట టౌన్, జూలై 12 : అర్ధరాత్రి రోడ్డుపై ఓ యువకుడిని మరో నలుగురు యువకులు దారుణంగా కొట్టిన ఘటన రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం డీఎస్పీ రవి కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేటలోని నెహ్రూ నగర్‌కు చెందిన ఆది వంశీ అనే యువకుడు ఓ బాలుడిని బెదిరించి కొట్టాడు. అనంతర ఆ బాలుడి తన బాబాయ్ అయిన పిడమర్తి ప్రభుకు విషయం చెప్పడంతో ప్రభు అతని సన్నిహితులైన పిడమర్తి రాంచరణ్, కొండ ప్రదీప్, వెలుగు వినయ్‌తో కలిసి నిర్మల హాస్పిటల్ సమీపంలో ఆది వంశీని ఇష్టం వచ్చినట్లు చేతులతో కడుపులో గుద్దుతూ ఇటుకలతో కొట్టారు. వెంటనే వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై బాధితుడు ఆది వంశీ తల్లి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించాం. సాయంత్రం 6 గంటల సమయంలో పక్కా సమాచారం మేరకు అంబేద్కర్ నగర్ వద్ద గల కొత్త వ్యవసాయ మార్కెట్లో నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించాం. ఈ కేసులో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోగా మరో యువకుడు వెలుగు వినయ్ పరారీలో ఉన్నాడు. నిందితుల్లో ఎవరికీ గతంలో గానీ ఇప్పుడు గానీ గంజాయి సేవించే అలవాటు లేదని తెలిపారు. ఈ సందర్భంగా కేసును ఛేదించిన సీఐ రాజశేఖర్, ఎస్ఐలు మహేంద్ర నాథ్, బాలకృష్ణ, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కరుణాకర్, సైదులు, కానిస్టేబుల్ ఆనంద్, మధును డీఎస్పీ రవి అభినందించారు.