నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్18(నమస్తే తెలంగాణ): ఏప్రిల్ మూడో వారం పూర్తి కావొస్తున్నా ఉమ్మడి జిల్లా లో నేటికీ ధాన్యం కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలకు, జిల్లా మంత్రులకు కనీసం పట్టింపు కూడా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధికారులు హడావుడి చేస్తున్నా అందుకు తగిన ఫలితం లేదు. ముఖ్యం గా ధాన్యం దిగుమతి చేసుకోవాల్సిన రైసు మిల్లర్ల నుంచి ఎదురువుతున్న సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం దాన్ని అధికారులకు వదిలేస్తే మిల్లర్లు వారి మాటను పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. దీంతో కొనుగోలు చేసిన కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం మిల్లుల వద్ద లారీల్లో పేరుకుపోతుంది.
శనివారం నాటికి 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే కేవలం 59 టన్నుల ధాన్యానికే ట్రక్ షీట్లు జారీ అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోంది. ట్రక్షీట్లే జారీ కానప్పుడు ఇక ధాన్యం చెల్లింపులు జరిగే అవకాశమే లేదు. అందుకే శనివారం నాటికి కూడా నల్లగొండ జిల్లాలో రూ.144.27కోట్ల ధాన్యం కొనుగోళ్లు జరిగినా అందులో ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లింపులు జరగలేదు. స్వయంగా జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పదేపదే ధాన్యం డబ్బులు రెండు రోజుల్లోనే చెల్లిస్తున్నట్లు చెప్తున్న మాటలన్నీ ఉత్తవేనని స్పష్టమతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మొదలు కాగా, నేటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇక మంత్రి సొంత జిల్లా సూర్యాపేటలో కేవలం 19వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరగడం గమనార్హం.
కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యం..
నల్లగొండ జిల్లాలో మొత్తం 444 కేంద్రాలకు గాను గత పక్షం రోజులుగా 373 కేంద్రాలను ఓపెన్ చేసి 262 చోట్ల కొనుగోళ్లు మొదలుపెట్టారు. ఈ కేంద్రాలకు నేటి వరకు మొత్తం 3.48లక్షల టన్నుల ధాన్యం రాగా 7077 మంది రైతుల నుంచి 60389 టన్నులు కొనుగోలు చేశారు. దీని విలువ 144.27 కోట్లుగా అధికారులు వెల్లడించారు. ఇంకా కేంద్రాల్లోనే 2.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. ఇది కాకుండా మరో వారం పది రోజుల్లో మరో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కేంద్రాలకు రానుందని అధికారుల అంచనా. అయితే ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం కొనుగోళ్లల్లోనే తీవ్ర జాప్యం జరుగుతోంది.
కొనుగోలు కేంద్రాల ప్రారంభం, వాటికి రైసు మిల్లుల కేటాయింపు, ట్రాన్స్‌పోర్టు వాహనాల ఏర్పా టు, రైసు మిల్లర్ల తిరకాసు ఇలా అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మిల్లర్లు ఈ సీజన్లో దిగుమతికి సుముఖంగా లేరు. తమకు రావాల్సిన మిల్లింగ్ బిల్లుల చెల్లింపులు, రా రైస్ సమస్య, తాలు వస్తుందన్న ఆందోళనలతో కొర్రీలు పెడుతూ ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో కేంద్రాల్లో కాంటా అవుతున్న ధాన్యం… లారీల్లో మిల్లులకు వెళ్లిన తర్వాత అక్కడే నిలిచిపోతున్నది. ఒక్కో మిల్లు వద్ద లారీలు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. ఒక్క లారీ దిగుమతి కోసం ఐదారు రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ట్యాబ్ ఎంట్రీ నామమాత్రమే..
వాస్తవంగా కేంద్రాల్లో కాంటా అయిన వెంటనే రైతుల పేరుతో ఎంత ధాన్యం కొనుగోలు చేశారన్న వివరాలతో ట్యాబ్ ఎంట్రీ చేస్తారు. కానీ ఇందులోనూ జాప్యం జరుగుతోంది. కేవలంరూ.2.85 కోట్ల విలువైన 1192 మెట్రిక్ టన్నులు మాత్రమే ట్యాబ్ ఎంట్రీ అయింది. ధాన్యాన్ని లారీల్లోకి లోడ్ చేసే క్రమంలో రైతుల పేరుతో ధాన్యం విలువతో ట్రక్ షీట్లు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ లోడైన ధాన్యం విలువను చీటీలపై రాసి రైతులకు ఇస్తున్నారు. రైతుల ధాన్యం మిల్లుల వద్దకు వెళ్లాక మిల్లర్లు కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో అసలు ట్రక్ షీట్లు దిగమతి అయ్యాకే జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల వరకు తాలు, తరుగు పేరుతో కోత పెడుతున్నారు. దీని కి రైతులు ఒప్పుకుంటే ధాన్యం దిగుమతి చేసుకోవడంతో పాటు ట్రక్ షీట్లు జారీ చేస్తున్నారు. దీంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేవలం 14 లక్షల విలువైన 59 టన్నులకు మాత్రమే ట్రక్ షీట్లు జారీ అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.
నేటికీ చెల్లింపులు శూన్యం…?
సీఎం, మంత్రులు రెండు రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నామని గొప్పులు చెప్తుండగా క్షేత్రస్థాయిలో పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి తర్వా త అత్యధిక ధాన్యం కొనుగోలు జరిగే నల్లగొండ జిల్లా లో నేటికీ ఒక్క రూపాయి చెల్లింపులు జరగలేదు. పక్షం రోజులుగా కొనుగోళ్లు జరుగుతున్నట్లు చెప్తున్నా డబ్బు చెల్లింపులు జరగడం లేదు. ట్రక్ షీట్లే జారీ కాకపోవడంతో చెల్లింపులకు ఛాన్స్ లేకపోయింది. రూ144.27 కోట్ల విలువైన 60 వేల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగినా ఒక్క క్వింటాల్‌కు కూడా ఒక్క రూపాయి చెల్లిం పు జరగలేదు. ఇలా ధాన్యం కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నా…జిల్లా మంత్రులకు పట్టింపులేదు. నేటికి ఒక్క సమీక్ష కూడా జరిపిన దాఖలాలు లేవు. ముందు కేరళ, ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ రైతులను గాలికి వదిలేసారు. దీంతో నిత్యం రైతుల రోడ్లెక్కుతున్నారు. శనివారం రోజున తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు హైవేపై బైఠాయించి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.