సూర్యాపేట, డిసెంబర్ 4 : కాంగ్రెస్ సర్కారు స్థానిక సంస్థల పాలన అధ్వానంగా మారుతున్నది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకులు లేకపోగా, పర్యవేక్షణ చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులను సైతం ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల పర్యవేక్షణ కోసం గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా క్రియేట్ చేసిన స్థానిక సంస్ధల అదనపు కలెక్టర్ పోస్టు సూర్యాపేట జిల్లాలో 4 నెలల నుంచి ఖాళీగా ఉంది. పంచాయతీలను పర్యవేక్షించాల్సిన జిల్లా పంచాయతీ అధికారి పోస్టు సైతం ఖాళీనే. జిల్లా పరిషత్ సీఈఓ పోస్టును ఇన్చార్జీతో నెట్టుకొస్తున్నారు. మండలాల్లో కీలకంగా పని చేసే ఎంపీడీఓలు 8 మండలాలకు, ఎంపీవోలు 3 మండలాలకు లేరు. వాటిల్లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దంపతులు ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నారు. మరోవైపు సుమారు 90 మందిపంచాయతీ కార్యదర్శుల వివిధ కారణలతో సెలవులు పెట్టడం, ఏ కారణమూ లేకుండా ఉద్యోగం బంద్ చేయడంతో ఆ స్థానాల్లో ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు.
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల పాలక వర్గాలు గడువు ముగియడంతో రద్దయిపోయాయి. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక పోవడంతో గ్రామాలకు, మండలాలకు ఇన్చార్జీలను నియమించి పాలన సాగిస్తున్నారు. వారితో పనులు చేయించాల్సిన లోకల్ బాడీ అదనపు కలెక్టర్ పోస్టు జిల్లాలో నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది. ఆగస్టు 3న ప్రియాంక బదిలీపై వెళ్లగా, నాటి నుంచి ఆ సీటు ఖాళీగానే ఉంది. దాంతో కలెక్టరే అదనపు బాధ్యతలు చూస్తున్నారు. మరోవైపు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మున్సిపాల్టీల పాలక వర్గాలు సైతం రద్దు కానున్నాయి.
జిల్లా పరిషత్ సీఈఓ పోస్టును సైతం ఇన్‌చార్జీతోనే నెట్టుకొస్తున్నారు. జడ్పీ సీఈఓగా జిల్లాకు వచ్చిన అప్పారావుకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించి జిల్లా పరిషత్‌కు మాత్రం ఇన్చార్జి సీఈఓగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. గ్రామ పంచాయతీలను చూసుకోవాల్సిన అధికారే లేకపోవడం గమనార్హం. జిల్లా పంచాయతీ అధికారిగా పని చేసిన సురేశ్ సెప్టెంబర్ ఒకటిన బదిలీపై వెళ్లగా, నాటి నుంచి సూర్యాపేట డీఎల్పీఓకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కోదాడ, అనంతగిరి, హుజూర్నగర్, చింతలపాలెం, జాజిరెడ్డిగూడెం, నడిగూడెం, మఠంపల్లి, నాగారం మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపీడీఓ తరువాత పర్యవేక్షణ చేసే ఎంపీఓలు సైతం మూడు చోట్ల లేరు. సూర్యాపేట, గరిడేపల్లి మండలాల ఎంపీఓలు పదవీ విరమణ పొందగా, మేళ్లచెర్వు యంపీఓ జాజారెడ్డిగూడెంలో డిప్యూటేషన్ పని చేస్తున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల పాలన ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.