గుండాల, జనవరి 27 ; ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు సకల వసతులకు నిలయాలుగా మారాయి. హాస్టళ్లలో ఉంటున్న నిరుపేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నది. విశాలమైన గదులు, పక్కా భవనాలు ఉండగా.. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు సమకూరుస్తున్నారు. సీసీ కెమెరాలతో నిఘా ఉండగా.. జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ కొనసాగుతున్నది. ఈ క్రమంలో హాస్టళ్లలో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.
ఎస్సీ విద్యార్థుల కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 బాలుర, 8 బాలికల ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, కళాశాల విద్యార్థుల కోసం మరో రెండు పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాలు.. మొత్తంగా 21 హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పాఠశాల స్థాయిలో ప్రీమెట్రిక్ హాస్టళ్లలో 1,387 మంది విద్యార్థులు, కళాశాల స్థాయి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 537 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీటిల్లో విద్యార్థులకు చక్కటి వసతితోపాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. పక్కా భవనాలు, విద్యార్థులు భోజనం చేయడానికి ప్రత్యేకంగా భోజన శాల, నిద్రించడానికి పరుపులతో కూడిన మంచాలు ఏర్పాటు చేశారు. బాలికల వసతి గృహాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ కొనసాగుతున్నది.
మెరుగైన వసతులు
ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం 4 జతల దుస్తులు, బెడ్‌షీట్, కార్పెట్, టవల్స్, ట్రంక్ పెట్టెలు అందిస్తున్నారు. మంచాలు, పరుపులు, మెత్తలు అందుబాటులో ఉంచుతున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు స్కూల్ బ్యాగు, షూ అందజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు డిక్షనరీలు అందజేస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నత చదువులకు దోహదపడేందుకు అర్హత పరీక్షల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు యోగా, బాలికలకు ఆత్మరక్షణ క్లాసులు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నాణ్యమైన భోజనం
రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నది. ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థులకు ఉదయం రాగి జావ, టిఫిన్‌గా జీర, టమాట అన్నం, కిచిడీ రసం, పులిహోర, కూరగాయల అన్నం సాంబారు, ఇడ్లి సాంబారు ఇస్తారు. మధ్యాహ్నం విద్యార్థులు ఆయా పాఠశాలల్లోనే భోజనం చేస్తారు. ఆదివారం వసతి గృహంలోనే చికెన్ కూరతో కూడిన అన్నం పెడుతారు. సాయంత్రం తినుబండారాలు, రాత్రి కూరగాయలతో కూడిన భోజనాన్ని అందిస్తారు. అందులో పప్పు, సాంబారు, గుడ్డు, పెరుగు, సెమియా, అరటిపండు పెడుతారు. పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఉదయం టీ అనంతరం టమాట, జీర అన్నం, కిచిడీ, పులిహోర, ఇడ్లి చట్నీ పెడుతారు. మధ్యాహ్నం కూరగాయలు, ఆకుకూరలతో కూడిన భోజనం, పప్పు, సాంబారు అందజేస్తారు. రాత్రి కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, సాంబారు, పెరుగుతో కూడిన భోజనం పెడుతారు. ఆదివారం చికెన్‌తో కూడిన భోజనం అందజేస్తున్నారు.
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నాం
వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. మంచం, పరుపులు, కార్పెట్, స్వెట్టర్లు, స్కూల్ బ్యాగ్, షూ, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందజేస్తున్నాం. మెనూ ప్రకారం భోజనం అందేలా చూస్తున్నాం. ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం.
– జైపాల్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా