చౌటుప్పల్ రూరల్, డిసెంబర్ 27 : చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే అత్యాధునిక యంత్రాల బిగింపు పనులు పూర్తయ్యాయి. సుమారు రూ.80 లక్షలతో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేస్తుండగా.. జనవరి 3న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. చౌటుప్పల్ పరిసర ప్రాంతాల కిడ్నీ వ్యాధి గ్రస్తులకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఈ కేంద్రం ద్వారా పేద వారికి సైతం కార్పొరేట్‌స్థాయి వైద్య సేవలు అందించనున్నారు.
స్థానిక ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో ఇప్పటికే యంత్రాల బిగింపు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు చకచకా సాగుతున్నాయి. డయాలసిస్ సెంటర్లో ఒకేసారి ఐదుగురికి రక్తశుద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. 24గంటలు సేవలందించే కేంద్రంలో ప్రతి రోజు 20 మందికి డయాలసిస్ చేయనున్నారు. ఒక డయాలసిస్ టెక్నీషియన్, మరో 9 మంది టెక్నీషియన్లు మూడు షిప్టులల్లో పని చేయనున్నారు. ఒకరికి డయాలసిస్ చేసేందుకు 4 గంటల సమయం పట్టనుండడంతో వారికి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత కిడ్నీ వ్యాధి గ్రస్తులు డయాలసిస్కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానలకు వెళ్తున్నారు. చౌటుప్పల్ కేంద్రం అందుబాటులోకి వస్తే వారికి దూరాభారంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పనున్నాయి.
నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగానే చౌటుప్పల్‌లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. జనవరి 3న ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో ఈ ప్రాంత కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పైసాఖర్చు లేకుండా సేవలు అందనున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతున్న మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి