యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రైతు సమస్యలపై ‘నమస్తే తెలంగాణ’ సమర శంఖం పూరిస్తున్నది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతున్న అన్నదాతకు అండగా నిలుస్తున్నది. కర్షకులు పడుతున్న అష్ట కష్టాలను అక్షర రూపంలో సరారు దృష్టికి తీసుకెళ్తూ రైతు పక్షంగా నిలుస్తున్నది. రైతు కళ్లల్లో చిరునవ్వే లక్ష్యంగా తోడుగా ఉంటున్నది. ప్రభుత్వ తప్పిదాలు, తప్పొప్పులు, వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం, నిర్లిప్తతను ఎండగడుతూ సమస్యల పరిషారానికి చొరవ చూపుతున్నది. రైతన్న కష్టకాలంలో ఉంటే.. ఫోర్త్ ఎస్టేట్‌గా మేమున్నామని నిరూపిస్తున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్నదాతకు ఏ కష్టం వచ్చినా అక్షర దివిటీగా నిలుస్తున్నది. అది రైతు భరోసా మొదలుకొని పాల రైతులకు బిల్లుల చెల్లింపుల వరకు నిర్ద్వందంగా ముందుకు సాగుతున్నది. ట్రిపుల్ ఆర్ రైతుల ఆవేదనను ఎత్తి చూపుతున్నది. మదర్ డెయిరీ నిర్వీర్యం, పాడి రైతుల ఆక్రందనను అక్షరం బద్దం చేసింది. పంట నష్టం, పంటల బీమా హామీపై నిలదీసింది. పత్తి, ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల కొర్రీలు, కోతలు, అధికారుల నిర్లక్ష్యంపై వరుస కథనాలతో కదం తొకింది. రైతు భరోసాలో కోతలు, బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్, రుణమాఫీ అమలుపై కథనాలతో రైతులకు న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేసింది. రైతు బీమా సకాలంలో అందకపోవడాన్ని విశదీకరించింది. సన్నాలకు బోనస్, వ్యవసాయ యాంత్రీకరణ, రైతులకు ట్రాన్స్ఫార్మర్ కష్టాలు, కరువు ఛాయలు, నీళ్ల కష్టాలు, రైతు ఆత్మహత్యలపై నిర్విరామంగా అక్షర రూపం ఇస్తున్నది.
