నల్లగొండ సిటీ, డిసెంబర్ 11 : గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సిబ్బందికి సూచించారు. గురువారం ఆమె కనగల్ మండలం జి.ఎడవెల్లి, ఇస్లాం నగర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటింగ్ జరిగిన విధానం తెలుసుకుని కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలు, భద్రతా చర్యలపై అక్కడే విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లతో మాట్లాడారు. ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ ని మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు.
పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత అసలైన బాధ్యత కౌంటింగ్ దశలో ప్రారంభమవుతుందని, కౌంటింగ్ ప్రక్రియలో జరిగే ప్రతి చర్య ఎన్నికల పారదర్శకతను ప్రతిబింభిస్తుందన్నారు. అందువల్ల ఓట్ల లెక్కింపులో ఏ చిన్న నిర్లక్ష్యం జరగకుండా చూసుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, కవర్లు, ఫారమ్‌లు, స్టేట్మెంట్లు అన్నింటిలో జాగ్రత్తగా వ్యవహరించాలని, బ్యాలెట్ల పరిశీలనలో పారదర్శకత అత్యంత ముఖ్యమన్నారు. బ్యాలెట్ పేపర్‌ను చెల్లిన ఓటు, చెల్లని ఓటు అని నిర్ణయించే సమయంలో ప్రతీ టేబుల్ వద్ద ఆర్ఓ, అలాగే ఏఆర్ఓ మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలన్నారు. ఏవైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు టేబుల్ సూపర్వైజర్ తక్షణమే ఆర్ఓను సంప్రదించి స్పష్టత తీసుకోవాలని చెప్పారు. అభ్యంతరం వచ్చిన ఓటును ప్రత్యేక కవర్లో ఉంచి లెక్కింపును పూర్తి చేయాలన్నారు.
ఒక్క చిన్న పొరపాటు తుది ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరమన్నారు. ప్రతి ఓటు ప్రజల నమ్మకానికి ప్రతీక అని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కౌంటింగ్ ప్రక్రియను అత్యంత నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం అందరి బాధ్యత అన్నారు. ఎవరూ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోను కావద్దన్నారు. కౌంటింగ్ వేగంగా జరగడం కంటే ఖచ్చితమైన ఫలితాలు రావడం ప్రధాన లక్ష్యమన్నారు. అందువల్ల ప్రతి టేబుల్ వద్ద సిబ్బంది శ్రద్ధగా తొందరనేది లేకుండా పని చేయాలన్నారు. అన్ని ఫారమ్‌లు, నమోదు పత్రాలు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే రౌండ్ ఫలితాలను ప్రకటించాలని చెప్పారు. ఫలితాలు పూర్తయిన తర్వాతే ఫామ్- 29 ను గెలిచిన అభ్యర్థికి సర్పంచ్‌గా ఇవ్వాలన్నారు. కలెక్టర్ వెంట జడ్పీ సీఈఓ శ్రీనివాస రావు, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, కనగల్ తాసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేద రక్షిత, ఎంపీఓ సతీశ్ కుమార్ ఉన్నారు.