చౌటుప్పల్, నవంబర్ 4: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చౌటుప్పల్లోని ఊరచెర్వు నిండి అలుగు పారుతోం ది. అలుగు నీరు సమీపంలోని వినాయక నగర్ కాలనీలోని ఇండ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీవో కార్యాలయంలోకి భారీగా వరద నీరు చేరింది. కార్యాలయం మొదటి అంతస్తు సగానికి పైగా మునిగింది. దీంతో కార్యాలయంలోని ఫైళ్లను మూటగట్టి తరలించే పనుల్లో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. దీని పక్కనే ఉన్న ఆర్డీవో కార్యాలయం పరిస్థితీ ఇలాగే ఉంది. ఇప్పటికే పాలశీతలీకరణ కేంద్రం, టీడీపీ కల్యాణ మండపంలోకి భారీగా వరద నీరు చేరడంతో సేవ లు నిలిచిపోయాయి.
అటుగా వెళ్లే రహదారిని సైతం మూసివేశారు. గతంలో కూడా ఊర చెర్వు అలుగుపారడం తో తహసీల్దార్, ఆర్డీవో, ఎంపీడీవో తదితర కార్యాలయాలతో పాటు కొన్ని ఇండ్లు నీట మునిగాయి. అప్పట్లో అద్దె భవనాల్లోకి ఆయా కార్యాలయాలను మార్చారు. నీటి మట్టం తగ్గిన అనంతరం తిరిగి ఆ కార్యాలయాలనే కొనసాగించారు. కానీ తహసీల్దార్ కార్యాలయం మాత్రం ఇప్పటికీ అద్దె భవనంలోనే నడుస్తోంది. అప్పట్లో నీరు రావడంతో రెవెన్యూ రికార్డులు తడిసిపోయాయి. అయినప్పటికి కూడా తహసీల్ కార్యాలయం అదే అద్దె భవనంలో కొనసాగుతోంది. ఊర చెర్వు పరీవాహక ప్రాంత (ఎఫ్టీఎల్) పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయ డం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యే పర్యటన..
ఊరచెర్వు అలుగుపారడంతో సర్వీసు రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీల నుంచి నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో డ్రైనేజీలపై భాగం నుంచి నీరు సర్వీసు రోడ్డుపైకి వస్తోంది. దీం తో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలకు వెళ్లేవారు నానా తంటాలు పడాల్సి వస్తోంది. కొన్ని కాలనీల్లో, రోడ్ల వెంట నీరు నిలిచి రాకపోలకు ఇబ్బందింగా ఉంది. మంగళవారం నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ఆర్డీవో శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డితో కలిసి ఆయన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైవే అథారిటీ వారు కేవలం రోడ్డుపై పడిన వర్షపు నీరు వెళ్లడానికి మాత్రమే సైడ్ డ్రెయిన్లు ఏర్పాటు చేశారని, రానున్న రోజుల్లో ఎంత పెద్ద వర్షమొచ్చినా ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు.