రామగిరి, డిసెంబర్ 19 : టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 28, 29 తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలో జరుగనున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాల పోస్టర్ను నల్లగొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో విద్యా సదస్సు జరుగుతుందని, విద్యావేత్తలు, ప్రముఖులు ఈ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం కార్యచరణ చర్చించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎస్ యూటీఎఫ్ జిల్లాల నాయకత్వం పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు, విద్యారంగ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, ఆడిట్ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మురళయ్య, సభ్యులు మధు సూధన్, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.